విదేశీ ప్రముఖులకు మోదీ బహుమతులు
న్యూఢిల్లీ, మే 21: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలో పర్యటించిన విషయం తెలిసిందే.. ఇటీవల ముగిసిన తన పంచదేశాల పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ముగా సిల్క్ స్టోల్, డచ్ ప్రధాని రాబ్ జెట్టెన్‌కు మధుబని పెయింటింగ్, స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్‌సన్‌కు లడఖీ స్వచ్ఛమైన ఉన్ని స్టోల్ వంటి కొన్ని బహుమతులను అందజేశారు.
దీనికి అదనంగా, ప్రధాని మోదీ ఇటలీ ప్రరధాని మెలోనికి ఒక మెలోడీ టాఫీల ప్యాకెట్‌ను కూడా గిఫ్ట్ ఇచ్చారు. అలాగే యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు కేసర్ మామిడి పండ్లు, మేఘాలయ పైనాపిల్స్, ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రూన్ ఫ్రాస్టాడోటిర్‌కు షెర్పా టెన్జింగ్ నార్గే ఉపయోగించిన ఐస్ యాక్స్ ప్రతిరూపాన్ని, డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్‌ఖు బిద్రి వెండి పనితో చేసిన పూల కుండీతో పాటు మరికొన్ని బహుమతులు అందజేశారని అధికారులు తెలిపారు.
మణిపూర్‌లోని షిరుయ్ లిల్లీ పువ్వు స్ఫూర్తితో, ఇటలీ ప్రధానికి షిరుయ్ లిల్లీ పట్టు శాలువాను కూడా ఇచ్చారు. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లాకు, ప్రఖ్యాత హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు పండిట్ భీమ్‌సేన్ జోషి, కర్ణాటక గాయని ఎంఎస్. సుబ్బులక్ష్మి సీడీలతో కూడిన ఒక పాలరాతి పొదుగు పని పెట్టెను బహుమతిగా ఇచ్చారు.
నెదర్లాండ్స్ రాజు విల్లెం-అలెగ్జాండర్‌కు జైపూర్ నుంచి నీలిరంగు మట్టిపాత్రలను, నెదర్లాండ్స్ రాణి మాక్సిమాకు మీనాకారి, కుంద న్ చెవిపోగులను బహుమతిగా ఇచ్చారు. నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్‌కు చేపల ఆకృతితో ఉన్న మధుబని పెయింటింగ్‌ను గిఫ్ట్ ఇచ్చారు. నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్కు నొక్కిన ఆర్కిడ్ పెయింటింగ్, ఆర్కిడ్ పేపర్ వేయిట్లను బహుమతిగా ఇచ్చారు.






