కోతుల బెడద.. బాలుడికి గాయాలు!
తాళ్లగొమ్మూరులో రోజురోజుకూ పెరుగుతున్న కోతులు, వీధికుక్కలు
చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే జంకుతున్న వైనం
పట్టించుకోని అధికారులు?
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు(Burgampadu) మండలం తాళ్లగొమ్మూరు గ్రామంలో కోతులు, వీధికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇళ్ల పరిసరాలు, వీధులు, రహదారులపై కోతుల గుంపులు సంచరిస్తుండగా.. మరోవైపు వీధికుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
బాలుడిపై కోతుల దాడి
ఇటీవల గ్రామానికి చెందిన పరిటాల గణేష్ అనే బాలుడిని కోతులు కరవడంతో స్థానికుల్లో ఆందోళన మరింత పెరిగింది. జనావాసాల్లోకి కోతులు తరచూ వస్తుండటంతో ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల ముందు, వీధుల్లో కోతుల గుంపులు కనిపిస్తుండటంతో పిల్లలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు.
వీధికుక్కలదీ అదే పరిస్థితి
కోతులతోపాటు గ్రామంలో వీధికుక్కల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో పాదచారులు, ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు, వృద్ధులు రాకపోకలు సాగించే సమయంలో కుక్కలు వెంటపడే పరిస్థితులు ఉన్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
రోడ్లపైకి వస్తున్న జంతువులు
గ్రామంలోని ప్రధాన వీధులు, నివాస ప్రాంతాలతో పాటు ఇళ్ల సమీపంలోనూ కోతులు, కుక్కలు సంచరిస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆహారం కోసం ఇళ్ల వద్దకు వచ్చే కోతులను చూసి ప్రజలు భయపడుతున్నారు. జంతువుల బెడదతో పాటు వాటి వల్ల పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగాకే స్పందిస్తారా?
బాలుడిపై కోతుల దాడి జరిగిన నేపథ్యంలోనైనా అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. సమస్యను తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యేకంగా పర్యటించి కోతులు, వీధికుక్కల బెడదను గుర్తించి సంబంధిత శాఖల సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే మరిన్ని ఘటనలు జరిగే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.