24-04-2025 01:34:28 AM
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
మఠంపల్లి, ఏప్రిల్ 23: రైతులకి బహుళ ప్రయోజనాలు చేకూర్చేలా భూ భారతి చట్టం రూపొదించారాని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం మఠంపల్లి మండలంలో విఆర్‌ఎల్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భూభారతి చట్టం -2025 పై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవార్ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన భూభారతి చట్టం 2025 ద్వారా రైతులకు సులభతరమైన, న్యాయమైన సేవలు అందుతాయని,ఈ చట్టంలో ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని తమ సమస్యను దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని వివిధ స్థాయిలలో నిర్ణీత సమయాలలో దరఖాస్తులను క్షేత్రస్థాయి లో పరిశీలించి రైతుకు న్యాయం చేయడం జరుగుతుందని,భూముల సమస్య సులభంగా పరిష్కారం కోసం మార్పులు చేర్పులు (వికేంద్రీకరణ ) చేయడం జరుగుతుందన్నారు.
గత ధరణి పోర్టల్ లలో రెవెన్యూ అధికారులకు ఏమాత్రం అధికారం అవకాశం లేకుండా ఉండేదని తెలిపారు.నూతన చట్టంలో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశానుసారం త్వరలో గ్రామసభలు నిర్వహించి రైతుల నుండి తమ సమస్యల వివరాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు.భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారి, మండల సర్వేయర్లను నియమించుకోవడం కోసం సన్నాహాలు చేస్తుందన్నారు.
తద్వారా క్షేత్రస్థాయిలో నూతన రికార్డుల నిర్వహణకు సులభతరంగా ఉంటుందని సూచించారు. అదనపు కలెక్టర్ పి.రాంబాబు మాట్లాడుతూ గత ధరణి సమయాలలో రైతులు చిన్న చిన్న భూ విషయాలకు చాలా ఇబ్బందులు పడేవారని అట్టి సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి తెస్తే వారు ఏం చేయలేని పరిస్థితిలో ఉండేవారని గుర్తు చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్‌ఓఆర్ చట్టం 2025, ద్వారా రైతులకు సులభతరమైన న్యాయమైన సేవలు అందిస్తామన్నారు.రెవెన్యూ సదస్సుకు హాజరైన కొంతమంది రైతులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానాలు ఇచ్చి రానున్న గ్రామసభల ద్వారా తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఇవ్వాల్సిందిగా తెలిపారు. సదస్సుకు హాజరైన రైతులు భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం - 2025 మంచి నిర్ణయం అని రైతులు కొనియాడారు.
ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసులు, తహశీల్దార్ మంగా, మండల స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఏడి రవి, ఎంపిడిఓ జగదీష్, అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్,డి టి బాలరాజు, పి ఎ సి ఎస్ చైర్మన్ జవ్వాజి రామచంద్రయ్య,వైస్ చైర్మన్ బాబు నాయక్, రెవిన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.