11-02-2026 11:54:13 AM
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, యువత ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, ర్యాంపులు, వీల్‌చైర్లు తదితర మౌలిక సదుపాయాలు సమృద్ధిగా కల్పించినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగుతోందని అన్నారు.
పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుందని, అర్హులైన ప్రతి ఓటరు ఆలస్యం చేయకుండా తమ సమీప పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపు నిచ్చారు.