3 May, 2026 | 1:37 AM

హత్య చేసి ఇంట్లోనే శవం పూడ్చివేత

03-05-2026 12:17 AM
  1. దానిపై కిచెన్ ప్లాట్ ఫామ్ నిర్మాణం 
  2. ఐదు నెలల తర్వాత వెలుగులోకి

మేడ్చల్, మే 2 (విజయక్రాంతి): మద్యం మత్తులో జరిగిన వాగ్వాదం హత్యకు దారి తీసింది. ఆ తర్వాత శవాన్ని నిందితుడు ఇంట్లోనే పూడ్చివేసి పరారయ్యాడు. ఐదు నెలల తర్వాత ఇంటి యజమాని వచ్చి చూడగా హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలను మల్కాజిగిరి డిసిపి శ్రీధర్ వెల్లడించారు. నేరేడ్ మెట్‌కు చెందిన గవ్వల మల్లేష్ ప్లంబర్గా పనిచేస్తూ కుటుంబానికి వేరుగా జెకె కాలనీలో అద్దె ఇంట్లో అంటున్నాడు.

కంచి వెంకటరాములతో కలిసి డిసెంబర్ 15న మల్లేష్ ఇంట్లో మద్యం సేవించారు. ఈ సమయం లో మల్లేష్‌ను వెంకట రాములు వ్యక్తిగతంగా దూషించాడు. దీంతో మల్లేష్ కర్రతో చితక బాధగా వెంకట రాములు అక్కడికక్కడ మరణించాడు. శవాన్ని అదే ఇంట్లో గుంత తీసి పూడ్చివేశాడు. దానిపై కిచెన్ ప్లాట్ఫారం నిర్మించాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.

ఐదు నెలలుగా అద్దె చెల్లించకపోవడమే గాక, మల్లేష్ ఇంటి వైపు రాకపోవడంతో యజమాని ఈ నెల 17న తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. ఇంట్లో దుర్వాసన వచ్చింది. అనుమానంతో ప్లాట్ఫారం కింద తవ్వి చూడగా అస్తిపంజరం బయటపడింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు మల్లేశం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసును చేదించిన స్థానిక పోలీసులను డీసీపీ అభినందించారు.