3 May, 2026 | 5:39 PM

నా తెలంగాణ.. ఉద్యమాలకు చిరునామా!

03-06-2024 12:05 AM

సమరానికి తైలమై ఉద్యమానికూపిరై 

వందల మంది పన్నెండొందల మంది..

ఆత్మార్పణ చేసినారు చరిత్రలో వెలిగినారు 

తెచ్చుకున్న తెలంగాణ సాధించిందేమున్నది 

అప్పుల కుప్ప దప్ప అభివృద్ధి ఎక్కడుంది? 


రెచ్చగొడితే ఉరికిపోయి ఉద్యమాల్లో దుంకినారు

తెలంగాణ సాధనలో ముందుండి పోరినారు

తెలంగాణ ఆంధ్రంటు తన్నుకొని సచ్చినారు 

తెలంగాణ వొస్తే మాకు ఉద్యోగాలొస్తయని

ఆశపడ్డ యువత నాడు తెగించి నడిచింది.


వీరుడు శ్రీకాంతచారి, కానిస్టేబుల్ కిష్టయ్య 

సిరిపురం యాదయ్య, అమరుడు ఇషాంత్ రెడ్డి 

మీగడ సాయికుమార్ యాదవ్, వేణుగోపాల్ రెడ్డి 

అణచివేత, నిర్బంధం, బానిసత్వ బంధనాలు 

ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని ఉద్యమకారులంతా 

కీలకంగా మారినారు ధూం ధాం నడిపినారు. 


నీళ్ళు, నిధులు, నియామకాలు ఉద్యమ ఎజెండాగా 

సాగిన పోరాటంలో సకల జనులు ఒక్కటై..

సైనికులై సాగినారు మిలియన్ మార్చ్ జరిపినారు

ప్రాణాలను సైతం తెలంగాణకు ఆహుతిచ్చినారు 

మంటల్లో కాలుతున్న ఆగలేదు తెలంగాణ నినాదం


సాగరతీరంలోన మానవహారం నిర్వహించి 

సకలజనుల సమ్మెలోన సబ్బండ వర్ణాలైన 

ఉద్యోగులు, కార్మికులు, వృత్తి నిపుణులంతా

యువజన విద్యార్థులు న్యాయవాదులంతా

పిడికిలి ఎత్తి కదిలినారు ఉద్యమం చేసినారు.


అలుపెరుగని జేఏసీ పోరాట శిఖరమై.. 

మలి దశ ఉద్యమం ప్రళయ సింధువైంది

అమరుల త్యాగాలే అక్షర సత్యం..

సాధించిన స్వరాష్ట్రం మీకే అంకితం 

మీ ఆశయ దారిలోనే మేమంతా పోరుతాము

తెలంగాణ అభివృద్ధికి పాలకులను ప్రశ్నిస్తం!


 గడ్డమీది చంద్రమోహన్ గౌడ్ 

సెల్: 9866510399