ప్రగతి బాటన తెలంగాణ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి దారి తీసిన పరిస్థితులు, సాగిన పోరాటాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకోవడం ఎంతయినా అవసరం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఒకప్పుడు నిజాం ఏలుబడిలో ఉండిన తెలంగాణ ప్రాంతాన్ని కలిపి 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయిన నాటినుంచే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమానికి బీజం పడిందనే చెప్పాలి. నివురు గప్పిన నిప్పులా తెలంగాణ ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి 1968 సంవత్సరాల్లో ఉద్యమంగా ఉవ్వెత్తున ఎగసిపడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం అప్పుడు మొదలైన ఉద్యమం హింసాత్మకంగా మారడం, కేంద్రంలోని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉక్కు పాదంతో ఉద్యమాన్ని అణచి వేయడం చరిత్ర. హైదరాబాద్‌లోని గన్‌పార్కులో ఉన్న అమరవీరుల స్థూపం ఆ ఉద్యమంలో అసువులు బాసిన 360 మందికిపైగా అమరవీరుల బలిదానానికి ప్రతీకకగా నేటికీ నిలిచింది.
రాజకీయ ఉద్యమంగా మారిన ఫలితం
అప్పటి నుంచి దాదాపు మూడు దశాబ్దాలపాటు ఉద్యమాన్ని తిరిగి ఉధృతం చేయడానికి విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు, సామాజిక సంఘాలు, రాజకీయ పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్రం సాధ్యపడుతుంది గనుక ఈ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం హోదాను సాధించాలంటే దీన్ని రాజకీయ ఉద్యమంగా మార్చాలని కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ కొత్తపల్లి జయశంకర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ లాంటి మేధావులు భావించారు. అదే సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ఏర్పాటయిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీ మరోసారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసింది. కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు విద్యార్థులు మొదలుకొని రాజకీయ పక్షాలదాకా అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు లభించింది.
ప్రజల నుంచి కూడా పూర్తి మద్దతు లభించింది. దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఆ తర్వాత 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను ప్రతిఫలించింది. నూతన తెలంగాణ ఉద్యమానికి ఈ ముగ్గురు నేతలు కొండా లక్ష్మణ బాపూజీ లాంటి నాయకులు, వేలాదిమంది కళాకారులు, రచయితలు ఊపిరిలూదారు. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును తన కనీస ఉమ్మడి కార్యక్రమంలో చేర్చినప్పటికీ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన నేతలు ముఖ్యంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయింది. దీంతో కేసీఆర్ కూటమినుంచి బైటికి వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోపాటు ప్రత్యేక తెంగాణ రాష్ట్రానికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టారు. అయినప్పటికీ, వైఎస్‌ఆర్ రాష్టాన్ని విడగొట్టడానికి ససేమిరా అంగీకరించలేదు.
2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే, ఆంధ్రప్రాంత ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో మరోసారి తెలంగాణ ప్రాంతంలో మహోధృతంగా ఉద్యమం ప్రారంభమయింది. ‘సకల జనుల సమ్మె’తో42 రోజులపాటు ప్రభుత్వ పాలనను స్తంభింపజేశారు. చివరికి 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బిల్లును ప్రవేశ పెట్టడం, ఆంధ్ర ప్రాంత నాయకుల నిరసనల మధ్యనే దాన్ని ఆమోదించడం జరిగింది. ఫలితంగా 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయింది. ఇదంతా గతించిన చరిత్ర. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోపాటు ఏ నిధులు, నీళ్లు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఆ కలలను సాకారం చేసుకునే దిశగా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయడం ప్రారంభించింది. పదేళ్ల సమయం ఏ రాష్ట్రానికైనా తక్కువే కావచ్చు కానీ, తెలంగాణ మాత్రం ఈ పదేళ్ల కాలంలోనే పాతికేళ్ల అభివృద్ధిని సాధించింది.
దేశానికే అన్నం పెట్టగల స్థాయికి!
కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు అలుపెరగని పోరాటం, లక్షలాది ఉద్యమ వీరుల తోడ్పాటుతో సాధించిన తెలంగాణను అభివృద్ధి బాటలో పరుగులు తీయించడానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచే కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. అటు వ్యవసాయ రంగంతోపాటు ఇటు పారిశ్రామిక రంగంలోనూ రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించింది. ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయంగా ఉండిన తెలంగాణ ఇప్పుడు దేశానికే అన్నం పెట్టగలిగే స్థితికి చేరుకుంది. వ్యవసాయానికి నిరంతరం కరెంటు సరఫరాతో కోటి టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి చేసే స్థ్థాయికి చేరుకుని రికార్డులు సృష్టిస్తోంది. ఇక, పరిశ్రమలు నెలకొల్పడానికి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడంతో హైదరాబాద్ విశ్వనగరం స్థాయికి చేరుకుంది. దీనికి అనుగుణంగా నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పలు ప్రణాళికలు సైతం సిద్ధమవుతున్నాయి. రాజకీయ పార్టీల ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రగతికి బలమైన పునాదులు పడ్డాయనేది కాదనలేని నిజం. ఒక బ్రాండ్‌గా తెలంగాణ నిలిచింది.
కొత్త ఆశలతో మరింత వేగంగా!
నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన డిమాండ్లతో తెలంగాణ సాధించుకున్న రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమయిందన్న భావన రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతగా మారి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరాజయం పాలయి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజారంజక పథకాలను కొనసాగిస్తూనే వాటికి మరింత మెరుగులు దిద్దడానికి కొత్త ప్రభుత్వం సంకల్పించడం ముదావహం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అన్న వాస్తవాన్ని గ్రహించిన కొత్త ప్రభుత్వం ఆ దిశగానే ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయినప్పటికీ నిర్దిష్ట ప్రణాళికతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయించాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జూన్ 2న (ఆదివారం) పరేడ్ గ్రౌండ్‌లో భారీ సభ ఏర్పాటు చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడంతోపాటు భవిష్యత్తు కార్యాచరణను ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల కోడ్‌లాంటి అడ్డంకుల కారణంగా వాయిదా పడిన హామీలను అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచుకోవడంతో పాటుగా గాడి తప్పుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలి. తద్వారా రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడాలి. రాబోయే అయిదేళ్లలో గత ప్రభుత్వం కన్నా మించిన వేగంతో రాష్ట్ర ప్రగతికి బాటలు పడతాయని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని, ఇందుకోసం పాలకులు త్రికరణ శుద్ధితో కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆశిద్దాం.






