రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలు జయప్రదం చేయాలి
తిరుమలాయపాలెం,(విజయ క్రాంతి): తిరుమలాయపాలెం: సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం(Farmers' Workers' Union) నాలుగో జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని రైతు కూలీలకు సంఘం మండల అధ్యక్షుడు గొర్రెపాటి వీరస్వామి పిలుపునిచ్చారు. మహాసభల ప్రచారంలో భాగంగా జింకలగూడెం, తిప్పారెడ్డిగూడెం, పాతర్లపాడు, హస్నాబాద్ గ్రామాల్లో పోస్టర్లు ఆవిష్కరించి విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వీరస్వామి మాట్లాడుతూ రైతులు, కూలీల సమస్యలపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, మద్దతు ధర కల్పించాలని, రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 28న ఖమ్మం డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు రైతులు, కూలీలు, కార్మికులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.