15 April, 2026 | 2:57 AM

అంబేద్కర్‌కు దేశమంతా నివాళి

15-04-2026 12:34 AM

అణగారిన వర్గాలకు ఆయన జీవితం అంకితం: రాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౪: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం యావత్ దేశవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. ఊరూరా వీధి విధినా సంబురాలు మిన్నంటాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె జాతికి సందేశమిచ్చారు. ఆయన గొప్ప న్యాయకోవిదుడని, ఆర్థికవేత్త అని కొనియాడారు. కుల రహిత సమాజం కోసం అహర్నిశలు శ్రమించారని కీర్తించారు. యావ త్ జీవితాన్ని అణగారిన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంకితం చేశారని శ్లాఘించారు.

ఆయన స్ఫూర్తి భవిష్యత్‌తరాలకూ ఆదర్శమని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ అంబేద్కర్ ఆదర్శాలను ఆచరిస్తూ.. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపనిచ్చారు. అలాగే, పార్లమెంట్‌లోని ‘ప్రేరణా స్థల్’ అంబేద్కర్ విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, జయంత్ చౌదరి, రాందాస్ అథవాలే కూడా నివాళులర్పించారు.