15 April, 2026 | 3:10 AM

బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి

15-04-2026 12:36 AM
  1. బీజేపీ నుంచి రాష్ట్రంలో మొట్టమొదటి సీఎం ఆయనే

పిన్నవయస్సులోనే రాజకీయాల్లోకి సామ్రాట్ అరంగేట్రం

ఆర్జేడీ కార్యకర్తగా సేవలు.. రబ్రీదేవి ప్రభుత్వంలో మంత్రిగా సేవలు 

2014లో జేడీయూలో చేరిక.. జితన్‌రామ్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు

2018లో బీజేపీ గూటికి.. 2023లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక

తాజాగా నితీష్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో సీఎం కల సాకారం

పాట్నా, ఏప్రిల్ 14: బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా అనంతరం బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని అధిష్ఠానం ఎంపిక చేసింది. బుధవారం ఉదయం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. తనపై విశ్వాసం ఉంచి ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతున్న బీజేపీ అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సీం పదవి తనకు ఒక పదవి మాత్రమే కాదని, బీహార్ ప్రజల నమ్మకాన్ని, కలలను నెరవేర్చేందుకు లభించిన చక్కటి అవకాశమని అభివర్ణించారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి, సుపరిపాలన పథంలో నడిపిస్తానని వెల్లడించారు.

సామ్రాట్ చౌదరి ఆ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించారు. అదేమిటంటే.. బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పదవి అలంకరిస్తున్న మొట్టమొదటి నేత సామ్రట్ చౌదరినే కావడం విశేషం.

రాజకీయ కుటుంబ నేపథ్యం

సామ్రాట్ చౌదరి 1968 నవంబర్ 16న బీహార్‌లోని ముంగేర్ జిల్లా లఖంపూర్‌లో జన్మించారు. ఈయన అసలు పేరు రాకేశ్‌కుమార్. వారిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి శకుని చౌదరి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీగా పని చేశారు. తల్లి పార్వతీ దేవి కూడా ఎమ్మెల్యేగా సేవలు అందించారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన బలమైన కుటుంబంగా రాష్ట్రంలో వారికి పేరుంది. సామ్రాట్ ప్రాథమిక విద్య లఖంపూర్‌లోనే సాగింది.

ఆయన కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిరోజుల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)లో ముఖ్య కార్యకర్తగా పనిచేశారు. 1999లో రబ్రీ దేవి ప్రభుత్వంలో అతి పిన్నవయసులో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో వయస్సు వివాదం తలెత్తి పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది. అనంతరం 2000, 2010లో పర్బత్తా నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

2014లో జేడీయూలో చేరి జితన్‌రామ్ మాంఝీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2018లో సామ్రాట్ బీజేపీలో చేరారు. పార్టీలో ఆయన ఎదుగుదల చాలా వేగంగా సాగింది. 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల నితీష్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, హోం శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు స్వీకరించారు. తన రాజకీయ శైలితో రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఒక దశలో ఆయన సీఎం నితీష్‌కు వ్యతిరేకంగా పని చేశారు. రాజకీయ సమీకరణాల్లో ఆర్జేడీ, బీజేపీ కూటమి ఏర్పడటంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. తాజాగా నితీష్ రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమవడంతో సామ్రాట్ సీఎం కల సాకారమైంది.