మంచి భాగస్వామి కావాలి
మమతా మోహన్ దాస్.. సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే కథానాయికగానే కాదు, గాయనిగానూ అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నది. తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో పాటలు పాడిందీ మలయాళీ ముద్దుగుమ్మ. ‘రాఖీ’ సినిమాలోని టైటిల్ సాంగ్‌తో తెలుగులో గాయనిగా కెరీర్ ఆరంభించిన ఈ భామ ‘యమదొంగ’తో జోడీ కట్టి తనదైన అందం, అభినయం, ఆహార్యంతో అభిమానుల మనసు దోచేసింది. తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దక్షిణాది భాషల్లో ఓ ఊపు ఊపింది. 2011లో ప్రజిత్ పద్మనాభన్‌ను వివాహం చేసుకొని, ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకుంది. అయితే, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ బ్యూటీ. ‘లాస్ ఏంజిల్స్‌లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించాను.
కానీ, ఆ బంధం ఎక్కువ రోజులు నిలువలేదు. జీవితంలో రిలేషన్ ఉండాలి. ప్రతి ఒక్కరికీ తోడు అవసరం. కానీ ఆ బంధం ఒత్తిడితో కూడుకున్నదై కావొద్దనేదే నా భావన. ప్రస్తుతానికి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తు గురించి ఇప్పుడేమీ చెప్పలేను. మంచి జీవిత భాగస్వామి కోసమైతే వెతుకుతున్నాను’ అని వివరించింది. ఇక తన కెరీర్ గురించీ చెప్పిందీ చిన్నది. ‘తెలుగు, తమిళ భాషల్లో స్టార్స్‌తో స్క్రీన్ పంచుకునే అవకాశం దక్కింది. మలయాళీ ఇండస్ట్రీలో కూడా నాకు మంచి గుర్తింపు వచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను పోషించిన పాత్రలకు అగ్ర నటీనటుల నుంచి ప్రశంసలు వస్తుండటం మరువలేను’ అని వివరించింది. నిరుడు ఐదు చిత్రాలతో సందడి చేసిన మమతా మోహన్ దాస్ ఈ ఏడాది విజయ్ సేతుపతి 50వ చిత్రంగా వచ్చిన ‘మహారాజ’లో నటించింది. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది.






