16 July, 2026 | 11:56 AM

రిస్క్ అని తెలిసే చేశాం

16-06-2024 12:05 AM

సుధీర్ బాబు కథానాయకుడిగా జ్ఞానసాగర్ దర్శకత్వం వహించిన ‘హరోం హర’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ‘సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్’ సంస్థలో జి.సుబ్రహ్మణ్యం, సుమంత్ నాయుడు రూపొందించారు. ఈ సందర్భంగా సినిమాకి వస్తున్న స్పందనని నిర్మాతలు మీడియాతో పంచుకున్నారు. “సినిమా నిర్మాణం రిస్క్‌తో కూడుకున్నదని తెలుసు. ఎందులో అయినా రిస్క్ ఉంటుంది. సినిమాల మీద మాకున్న ఇష్టంతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టాం. ఇంతకుముందు సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పేరిట ‘అల్లుడు అదుర్స్’ చేశాం. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పెట్టి తొలి సినిమాగా ‘హరోం హర’ నిర్మించాం. సుధీర్ బాబు నటించిన సినిమాల్లో ఈ సినిమాకి మంచి వసూళ్ళు వస్తున్నాయి.

ముందు నుంచే మంచి సినిమా చేస్తున్నామన్న భావన ఉంది. తన మీద ఉంచిన నమ్మకాన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడు. దర్శకుడే అనుకుంటే.. సినిమాటోగ్రఫీ, సంగీతం సినిమాని ఇంకా ఉన్నతంగా నిలబెట్టాయి. చైతన్ భరద్వాజ్ సంగీతానికి చాలా మంచి స్పందన లభిస్తోంది. పరిశ్రమ వారితో పాటు పరిచయస్తులు చాలామంది సినిమా బాగా చేశామని ప్రశంసిస్తున్నారు. డబ్బింగ్ ఆలస్యమవుతుందన్న కారణంతోనే మిగతా భాషల్లో చేయాలన్న ప్రయత్నాన్ని విరమించుకున్నాం. తర్వాతి సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అవి కొలిక్కి రాగానే పూర్తి వివరాలతో ప్రకటిస్తాం” అని తెలిపారు.