16 July, 2026 | 12:21 PM

కమిటీ కుర్రాళ్లతో కనెక్ట్ అవుతారు

16-06-2024 12:05 AM

నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియో పతాకాలపై పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మిస్తున్నారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్‌ను కథానాయకుడు నితిన్ ఆన్‌లైన్‌లో విడుదల చేయగా, దీనికి సంబంధించి ఓ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు చిత్ర నిర్మాతలు.

ఈ కార్యక్రమంలో నిహారిక మాట్లాడుతూ “గ్రామీణ నేపథ్యంలోని భావోద్వేగాలతో రానున్న ఈ సినిమాలో ఎనిమిదేళ్ళ నుండి కలిసి పెరిగిన కొంతమంది యువకుల జీవితాల్లోని ఘటనలు తెరమీద చూడనున్నారు. పదకొండు మంది కొత్తవారితో చేసిన ఈ సినిమాలో పదకొండు జీవితాలు కనపడతాయి. చూసిన ప్రతి ఒక్కరూ సినిమాలోని ఏదో ఒక పాత్రతో తమని తాము పోల్చుకుంటారు. త్వరలోనే ట్రైలర్ విడదల చేయనున్నాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఫణి అడపాక, సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత మన్యం రమేష్, ఫైట్ మాస్టర్ విజయ్ పాల్గొన్నారు.