ఓబీసీ వాటా ఏది?
ఎన్నికల వేళ ఈ నెల 16, 17, 18వ తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి? ఓబీసీలను ఏ విధంగా దగా చేయాలనే అంశంపై మోదీ ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందాలనే దరిమిలా ఈ ఎత్తుగడకు నాంది పలికింది.
2023 సెప్టెంబర్‌లోనే 106వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పడు జరిగే పరిణామాలపై కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలకు బీజేపీ జవాబు ఇవ్వలేదు. అటువంటిది 30 నెలల పాటు స్తబ్ధుగా ఉండి ఒక్కసారిగా ఉరుముతోంది. నాడు 2029 ఎన్నికల్లో అమలుపరచడం సాధ్యం కాదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం నేడు రివర్స్ గేర్ వేసి అమలుకు కార్యాచరణ ప్రారంభించింది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ అడ్డుపడిందనే సందేశం ఇవ్వడానికి తహతహలాడుతోంది. అయితే మొదటగా 1996లోనే సోనియాగాంధీ ఆధ్వర్యంలో మహిళా బిల్లు ప్రవేశపెట్టి కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని చాటింది.
అప్పుడు ఎవరెవరు అడ్డుకున్నారో, మహిళా బిల్లు ఎందుకు వీగిపోయిందో తెలియనిది కాదు కదా? పలుచపడ్డ తన గ్రాఫ్‌ను పెంచుకోవడానికి మహిళా రిజర్వేషన్లను బీజేపీ ఏరవేస్తున్నది. ఇక్కడ మహిళా రిజర్వేషన్లలో ఓబీసీల వాటా తేల్చాలనే సోయి లేకుండా కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసే ప్రయత్నం అడుగడుగునా చేస్తున్నది. ఓబీసీల వాటా తేల్చకుండా 50 శాతం పెంపు ఫార్ములాతో డీలిమిటేషన్ చేస్తే సామాజిక ఉద్యమం తప్పదు.
కేంద్రం తెచ్చిన మహిళా రిజర్వేషన్లు అమలైతే పాలన నిర్ణయాల్లో గణనీయమైన మార్పుతో పాటు భారత రాజకీయ స్వరూపమే మారనుంది. ఈ చట్టం రాజకీయాల్లో లింగ అసమానతకు పరిష్కారం చూపెట్టినా దొడ్డిదారిలో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగించే కుట్రకు బీజేపీ తెరలేపింది. భారత జనాభాలో 50 శాతం ఉన్న మహిళలు విద్య, ఉద్యోగ రంగాల్లో సగాన్ని ఎప్పుడో దాటి సత్తాచాటుతున్నారు. ఇదే ఒరవడి కొనసాగించేందుకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లలో ఓబీసీల వాటా తేల్చాలి.
అయితే, అంబేద్కర్, ఫూలే కోరుకున్న సామాజిక న్యాయానికి తూట్లు పొడిస్తే మాత్రం కుల, మత, రాజకీయ పురుషాధిపత్యాన్ని ఎదిరించే మరో సామాజిక ఉద్యమం తప్పదు. కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో తెచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతోందనే బీసీ సమాజం ఇప్పటికే రోడ్లపైకి వచ్చి ధర్నాకు దిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం అసాధారణమైన శ్రద్ధ చూపుతోంది.
దేశంలో జనాభా ఆధారంగా ఎంపీ సీట్లను పెంచాలన్న ప్రతిపాదన ఓబీసీల వాటా తేల్చకుండా అమల్లోకి వస్తే ఉత్పన్నమయ్యే ప్రతికూలతలను బీజేపీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోసేందుకు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాన్ని బీజేపీ తలకెత్తుకున్నది. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందడానికి మూడింట రెండొంతుల సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది.
రెండు రాష్ట్రాల్లో బలంగా ఉన్న విపక్షాలు మూడు రోజులపాటు పార్లమెంట్ సమావేశాలకు వస్తే, ఆ రాష్ట్రాల ఎన్నికల్లో గెలవాలనే ఎత్తుగడతోనే సమావేశాలు పెట్టిందనే విమర్శ ఉంది. వాస్తవానికి బడ్జెట్ సమావేశాల తర్వాత వాయిదా వేసి, ఐదు రాష్ట్రాలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల్లోని ఎంపీలు నాలుగు ఓట్లు సంపాదించుకోవడానికి అత్యుత్సాహం చూపెట్టడం అనుమానం రాకతప్పదు. లోక్‌సభ సభ్యుల సంఖ్య పెంపుదలకు సంబందించిన బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ఒక మైండ్ గేమ్ మొదలుపెట్టింది.
బిల్లు ఆమోదం పొందితే మహిళా ప్రాతినిధ్యం 272కి పెరుగడానికి మోదీ ప్రభుత్వం కృషి చేసిందని, ఆమోదం పొందకపొతే ఇండి యా కూటమిపై బురదజల్లి రెండు రాష్ట్రాల్లో కాలుమోపాలనే బలమైన ఆకాంక్ష కనపడుతున్నది. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా తేల్చాలని, 2026 లెక్కలు తేలే వరకు వాయిదా వేయాలని విపక్షాలు కోరుతున్నాయి. అయితే, ఇండియా, ఎన్డీయే కూటమి సభ్యులు ఓబీసీల వాటా తేల్చకుండా పెంపునకు సహకరిస్తే ప్రజాక్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో వారి బుద్ధిచెప్పే పరిస్థితి వస్తుందని బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
వ్యాసకర్త సెల్: 9866255355






