ఐటీసీ సాయంతో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం
బూర్గంపాడు, జూలై29,(విజయక్రాంతి): మండలంలోని సారపాక గ్రామ పంచాయతీ పరిధి గాంధీనగర్ ఒడియా క్యాంప్లో ఐటీసీ ’మిషన్ సునేహ్రా కల్’, వాష్ ఇన్స్టిట్యూట్ సంయుక్త సహకారంతో హెచ్డీఎఫ్సీఐటీసీ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా రూ.11.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాన్ని బుధవారం సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనిన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఐటీసీ సంస్థ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పనలో విశేష సేవలు అందిస్తోందని ప్రశంసించారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంస్థలను గౌరవించి, వాటి సహకారంతో గ్రామాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.తన ఏడు నెలల పదవీకాలంలోనే సుమారు రూ.8.50 కోట్ల అభివృద్ధి నిధులతో 130 సీసీ రోడ్లు, 150 కిలోమీటర్ల డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి సారపాకను మట్టి రోడ్లు లేని గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
బసప్ప క్యాంప్లో రూ.25 లక్షలతో భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.కార్యక్రమంలో సీడీపీవో మంగతాయారు, వార్డు సభ్యురాలు ఉమ, ఐటీసీ చీఫ్ మేనేజర్ చెంగలరావు, ఎంఎస్కే ప్రోగ్రామ్ మేనేజర్ జయప్రకాశ్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గీత, తార ప్రసాద్, వాష్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి.ఆర్. బాలకృష్ణ, ఉపసర్పంచ్ కన్నెదారి రమేష్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, వార్డు సభ్యులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.






