త్వరలో కొత్త జీసీసీ పాలసీ

12-09-2026 | 05:30am

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): అన్ని జిల్లాలకు ఐటీ రంగాన్ని(IT sector) విస్తరించడంలో భాగంగా త్వరలో కొత్త జీసీసీ పాలసీ(GCC Policy)ని తీసుకురానున్నామని మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోందన్నారు. హైదరాబాద్‌(Hyderabad)పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గిస్తూ రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ, పారిశ్రామిక రంగాల(Industrial sectors)ను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

శుక్రవారం అసెంబ్లీలో నిజామాబాద్ ఐటీ హబ్(Nizamabad IT Hub)/టవర్, పెట్టుబడులు, యువత(Tower, investments, youth)కు ఉపాధి అవకాశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. నిజామాబాద్ ఐటీ హబ్‌లో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, విప్రో, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా, యాక్సెంచర్, టీసీఎస్, ఒరాకిల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ తదితర సంస్థలను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

దీనివల్ల స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఐటీ హబ్‌లు, టవర్లపై అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేయించామని చెప్పారు. యాంకర్ పార్ట్‌నర్స్, ఇండస్ట్రీ పార్ట్‌నర్స్ భాగస్వామ్యం లేకుండానే అనేక ప్రాంతాల్లో ఐటీ హబ్‌లను నిర్మించడం వల్ల అవి నిరుపయోగంగా మారాయని వ్యాఖ్యానించారు. అలాంటి ఐటీ హబ్‌లు, టవర్లను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

హైదరాబాద్‌తోపాటు నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ వంటి టైర్- నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు. త్వరలో ఆదిలాబాద్ ఐటీ హబ్/టవర్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల భాగస్వాములు ముందుకొస్తే కొత్త ప్రాంతాల్లో ఐటీ హబ్లు, టవర్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

108 ఎంవోయూలు..

తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో హైదరాబాద్లో 75కు పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ప్రారంభమయ్యాయని, ఇది దేశంలోనే రికార్డు అని పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో లక్ష మంది యువతకు కొత్తగా ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఐటీ రంగానికి సంబంధించిన సమగ్ర ఎకోసిస్టంలో డేటా సెంటర్లు కీలక పాత్ర పోషించనున్నాయని తెలిపారు.

డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని, భవిష్యత్‌లో వాటి వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. స్థానిక విద్యుత్ అవసరాలకు ఇబ్బంది కలగకుండా డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టైర్- టైర్- నగరాలు, పట్టణాల్లోనూ డేటా సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా, జాతీయ, అంతర్జాతీయ రోడ్షోలు, సెక్టోరల్ కాంక్లేవ్‌లను నిర్వహిస్తున్నామని చెప్పారు.

పారి శ్రామికవేత్తలకు ఇబ్బందులు తలెత్తకుండా నోడల్ అధికారులతో ప్రత్యేక ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. కాలపరిమితితో కూడిన సింగిల్ విండో క్లియరెన్స్‌లు, సెల్ఫ్ సర్టిఫికేషన్, ఇన్సెంటివ్‌లు, ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. 2025, 2026 సంవత్సరాల్లో ఇప్పటివరకు పారిశ్రామికవేత్తలు, కంపెనీలతో పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 108 ఎంవోయూలు కుదుర్చుకుందని తెలిపారు.

గత తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో కుదిరిన 75 ఎంవోయూల్లో 23 శాతం, అంటే 17 ప్రాజెక్టులు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. రెండేళ్లలో దావోస్ పర్యటనల్లో కుదిరిన ఎంవోయూల్లో దాదాపు 45 శాతం ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయని వెల్లడించారు. 

ఫ్యూచర్ లేని బీఆర్‌ఎస్..

‘ఫ్యూచర్ లేని బీఆర్‌ఎస్ పార్టీ.. ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది’ అని శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కకూడదనుకునే పార్టీ బీఆర్‌ఎస్ అని, పెట్టుబడులు పెట్టకుండా పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఫార్మా సిటీ పేరుతో రెడ్ కేటగిరీ పరిశ్రమలకు శ్రీకారం చుట్టిందని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం గ్రీన్ ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు కట్టుబడి ఉందన్నారు.

రేర్, ప్యూర్ ఏరియాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే అభివృద్ధి ప్రాజెక్టులకు అనుగుణంగా పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేలా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాలకు శ్రీకారం చుడతామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఎంఎస్‌ఎంఈ పాలసీని తీసుకొచ్చామని, రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సెక్టోరియల్ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని, ముఖ్యంగా ఎగుమతి ఆధారిత రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రీన్ కేటగిరీ పరిశ్రమల ఏర్పాటును ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందన్నారు. ప్రతి ఎంవోయూ క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ప్రత్యేకంగా ఫాలోఅప్ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు