రేషన్ కార్డు న్యూ.. డాటా ఓల్డ్..
- అయోమయంలో లబ్ధిదారులు
కుటుంబ సభ్యుల వివరాల నమోదులో తప్పులు
మారని చిరునామాలు
మహబూబాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం (State Government) నూతనంగా జారీ చేస్తున్న రేషన్ కార్డుల్లో ఓల్ డేటా ముద్రితమై ఉండడంతో అనేకమంది కార్డు హోల్డర్లు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా డిజిటల్ క్యూఆర్ కోడ్ తో కూడిన రేషన్ కార్డులను జారీ చేస్తోంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో కొత్తగా ముద్రించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
అయితే అనేకచోట్ల కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డుల్లో పాత వివరాలే ఉన్నాయని, కుటుంబ సభ్యుల్లో కొందరు చనిపోయినప్పటికీ వారిని తొలగించలేదని, అలాగే అనేక గ్రామాలు ఇతర మండలాల్లో విలీనం అయ్యాయని, కొన్ని గ్రామాలు మున్సిపాలిటీ పరిధిలో చేరిపోయాయని, కొత్తగా మండలాలు వేరుపడ్డాయని, అయినప్పటికీ పాత పేర్లతోనే కొత్తగా రేషన్ కార్డులు ముద్రించి ఇచ్చారని అనేక చోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.
బహుళ ప్రయోజన కరంగా ఉండే విధంగా కొత్తగా రేషన్ కార్డులను రూపొందించడం జరిగిందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో అందుకు భిన్నంగా రేషన్ కార్డులు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను జారీ చేసిందని, అలాగే గతంలో ఉన్న పాత రేషన్ కార్డు హోల్డర్లకు కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని, అందరికీ ఒకే విధంగా డిజిటల్ కాదు ఉంటుందని, ఇది బహుళ ప్రయోజనకరంగా కుటుంబాలకు ఉపయోగపడుతుందని, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ కార్డును వినియోగించుకునే విధంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే తీరా ఇటీవల రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు వాటిల్లో ఉన్న పాత సమాచారాన్ని చూసి ఒక్కసారి అవాక్కయ్యారు. అనేక గ్రామాల పేర్లు పాత మండలాల్లో ఉన్నాయని, తమ గ్రామాలను కొత్త మండలాల్లో చేర్చి ఏండ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ పాత మండలాల చిరునామాతోనే కార్డులు జారీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిధిలో ఉన్న ఇనుగుర్తి ని నూతనంగా మండలం గా ఏర్పాటు చేశారు.
నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం, నాగారం తో పాటు కేసముద్రం మండలం అయ్యగారి పల్లి, ఇనుగుర్తి, కోమటిపల్లి తదితర గ్రామాలను నూతన మండలంలో చేర్చారు. అయితే ఇటీవల చిన్న ముప్పారం, ఇనుగుర్తి గ్రామాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. కార్డుల్లో మండలం గా కేసముద్రం ముద్రించడంతో ఆయా గ్రామాల రేషన్ కార్డుదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త మండలం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నప్పటికీ కొత్తగా ముద్రించిన రేషన్ కార్డుల్లో కేసముద్రం మండలంగా పేర్కొనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డులను చిరునామా, ఇతర వివరాలను ప్రభుత్వ పథకాల్లో ప్రామాణికంగా చూపడడానికి ఇది ఆటంకంగా మారిందని చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం ప్రభుత్వ నూతన రేషన్ కార్డులను అందజేస్తుండగా వాటిలో పాత వివరాలనే యధాతధంగా ముద్రించడం అయోమయానికి గురవుతున్నారు.
స్మార్ట్ రేషన్ కార్డు తప్పుల తడకగా ఉండడంతో అనేకమంది పెదవి విరుస్తున్నారు. తప్పుల సవరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదా, తీసుకుంటే ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. తప్పులతో జారీ చేసిన రేషన్ కార్డుల్లో తప్పులను తిరిగి సరి చేసుకోవడానికి ప్రజలు మళ్ళీ అధికారులకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త కార్డు అంటే కొత్త రంగు డివిజన్ మాత్రమే కాదని.. తాజా వివరాలతో తప్పులు లేకుండా ముద్రించి ఇవ్వాలని, ఇప్పటికైనా ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో జరిగిన తప్పులను సరిచేసి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకొని సరికొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కోరుతున్నారు.