24 August, 2026 | 2:32 PM

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం

24-08-2026 01:31 PM

అయోధ్యనగర్‌లో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు

రామగుండం, ఆగస్టు 24(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగుండం అయోధ్యనగర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉగ్రవాద సంబంధాలపై అనుమానాల నేపథ్యంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని విచారించినట్లు తెలుస్తోంది. అయోధ్యనగర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ కదలికలు, పరిచయాలు, సంబంధాలు తదితర అంశాలపై ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.

విద్యార్థికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, అతడి ఆన్‌లైన్ కార్యకలాపాలు, ఇతర అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు, విద్యార్థిపై ఉన్న అనుమానాలు లేదా ఆరోపణలపై ఎన్‌ఐఏ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సోదాల విషయం స్థానికంగా తెలియడంతో అయోధ్యనగర్‌లో కొంతకాలం ఉత్కంఠ నెలకొంది. అధికారిక సమాచారం వెలువడే వరకు ఈ ఘటనపై మరిన్ని వివరాలు స్పష్టంగా తెలియాల్సి ఉంది.