‘నో’ బఫర్ స్టాక్!
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సామాన్యుడి ఇంటిని, ముఖ్యంగా వంటింటిని తాకింది. మొన్నటి వరకు దేశమంతటా గ్యాస్ కష్టాలు వెంటాడగా, ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌ల వంతు వచ్చింది. అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ పరిణామాలతో దేశంలో సరిపడా ఇంధనం లేదని, ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంతో ప్రజలు పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్నారు.
ఇంధన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్న సరఫరా సంస్థలు ‘నో క్రెడిట్’ పాలసీని తెరపైకి తీసుకురాగా, కొన్నిచోట్ల బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఈ నేపథ్యంలో చమురు సంక్షోభం దేశంలో ఇంధన బఫర్ స్టాక్ గురించిన చర్చలకు దారితీసింది.
వాస్తవానికి 90 రోజులకు అవసరమైన ఇంధనాన్ని ప్రతి దేశం బఫర్ స్టాక్‌గా కలిగి ఉండాలని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ సిఫారసు చేస్తుంది. కానీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన సమాధానం ప్రకారం మన దేశంలో 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల (39 మిలియన్ బ్యారెళ్లు) బఫర్ స్టాక్ మాత్రమే ఉంది. ఇది పది రోజుల దేశ అవసరాలకు మాత్రమే సరి పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
దీనికి తోడు రోజూవారీ వాణిజ్య కార్యకలాపాల కోసం మరో 74 రోజులకు సరిపడా ఇంధనం దేశంలో ఉన్నట్లు సమాచారం. కాగా, చైనా అత్యధికంగా 1.4 బిలియన్ బ్యారెళ్లు, అమెరికా 714 మిలియన్ బ్యారెళ్ల బఫర్ స్టాక్‌తో పోలిస్తే భారత బఫర్ స్టాక్ చాలా తక్కువ. మన దేశంలో విశాఖపట్నంలో 1.33, మంగళూరులో 1.5, పాడూర్‌లో 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఇవన్నీ గత దశాబ్దం కిందటే అందుబాటులోకి వచ్చినవి కావ డం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఒడిశాలోని చాందిఖోల్‌లో 4, పాడూర్‌లో మరో 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు 2021 లో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇంకా పట్టాలెక్కని ఈ ప్రాజెక్టు లు అందుబాటులోకి వచ్చినా బఫర్ స్టాక్ మరో 12 రోజుల అవసరాలను మాత్రమే తీరుస్తుండటం దేశంలోని పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే, ప్రస్తుతానికి దేశంలో ఇంధన కొరత లేనప్పటికీ, పశ్చిమాసియా పోరు ఇలాగే కొనసాగితే మాత్రం బఫర్ స్టాక్ తక్కువగా ఉండటం తీవ్రంగా ప్రభావం చూపే ఆస్కారం ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఇక నైనా ప్రభుత్వం బఫర్ స్టాక్ పెంచేందుకు సత్వర చర్యలు చేపట్టాల్సిన అవ సరం ఎంతైనా ఉంది.






