12 March, 2026 | 10:02 AM

పాదచారులకు దారేదీ?

09-03-2026 12:00 AM

పట్టణంలో దర్జాగా ఫుట్పాత్ల కబ్జా..

సాయినగర్ వద్ద ఫుట్పాత్తోపాటు రోడ్డు పైనే దుకాణం

చిరు వ్యాపారుల నుండి షాపింగ్ మాల్స్ వరకు ఇష్టారాజ్యంగా ఆక్రమణ 

కొన్నిచోట్ల ఫుట్ పాత్ లతోపాటు రోడ్డుపై నే వ్యాపారాలు

వ్యాపార వాణిజ్య ప్రాంతాలలో తీవ్ర ట్రాఫిక్  సమస్య 

పాదచారులు రోడ్లపైనే నడవాల్సిన దుస్థితి 

నరకం చూస్తున్న పాదచారులు, వాహన దారులు

మణుగూరు, మార్చి8, (విజయక్రాంతి) :  మండల కేంద్రంలో పాదచారులు కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్ లు వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి.  అనేక వ్యాపార సముదాయాలకు అడ్డాగా మారి కబ్జా కోరల్లో చిక్కుకు పోతున్నాయి. ప్రజలు నడవటానికి కూడా వీలు లేనంతగా మారిపోయాయి. అడ్డుకోవలసిన అధికారుల పర్యవేక్షణాలేమితో ఫుట్పాత్  మీద వ్యాపారం చేసుకునే వారికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. పట్టణంలో దర్జాగా సాగుతున్న ఫుట్పాత్ల కబ్జా ఫై విజయక్రాంతి కథనం..

దర్జాగా కబ్జా..

మణుగూరు పట్టణం సబ్ డివిజన్ కేంద్రం తో పాటు పారిశ్రామికంగా  అవతరించడంతో ప్రజల రాకపోకలతోపాటు వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. భారీ షాపింగ్ మాల్స్ సైతం ఏర్పాటు అవుతుండడంతో పలు మండలాల నుంచి కొను గోలుదారులు తరలి వస్తున్నారు.

దీంతో ప్రధాన రహదారులు ఉదయం నుంచి రాత్రి వరకు కిటకిటలాడుతున్నాయి. పాదచారుల సెక్యూరిటీతో పాటు సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లు ఆక్రమణలకు గురవుతున్నాయి.  పట్టణం లో కూరగాయల నుంచి మొదలుకుని బట్టల దుకాణాలు, సెల్ఫోన్ షాపులు, చెప్పుల దుకాణాలు తదితర చిన్నాచితకా వ్యాపారులు ఫుట్పాత్లపై తిష్ట వేశారు.

వీటిని ఆక్రమించడంతో జనం నడవడానికి కూడా స్థలం లేకుండా పోయింది. పట్టణంలో రెండు వైపులా ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను చిరు వ్యాపారులు ఆక్రమించేశారు. ప్రధాన కూడళ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల ఆక్రమణలు పెరిగిపోయాయి. ఇక షాపుల యజమానులు తమ వాహనాలకు పార్కింగ్ స్థలాలుగా ఫుట్పాత్ లను వాడుకుంటున్నారు. షాపింగ్ సమ యాల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు సైతం ఫుట్పాత్లపై నిలపడంతో నడవడానికి కనీస స్థలం లేక జనం నానా అవస్థలు పడుతున్నారు.

సాయినగర్ వద్ద  రోడ్డు పైనే దుకాణం..

పట్టణంలోని సాయిబాబా గుడి ఎదురుగా యథేచ్ఛగా అడ్డగోలుగా ఫుట్పాత్ ఆక్రమణలు సాగుతున్నాయి. ఆ సెంటర్ ప్రధాన రహదారిఫై నలువైపులా బడ్డీలు, కంటైనర్లు విస్తరించాయి. ఫుట్పాత్, రహదారిని ఆక్రమిస్తూ కొందరు వ్యాపారం చేస్తున్నారు. ఒకవైపు సాయిబాబా గుడి మరోవైపు కోర్టు, గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఆ ఏరియాలో ఫుట్ పాత్, రహదారి  ఆక్రమణలతో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా యి.

కనీసం పట్టించుకునే నాథుడే లేడు. చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇదే అదనుగా భావించిన ఆక్రమణ దారులు ఫుట్పాత్ పైనే  భారీ కంటైనర్  ఏర్పాటు చేసుకొని  కమర్షియల్ దందాకు తెరలేపారు.  ఎంచక్కా కిరాయికి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు ఎవ్వరూ చర్యలు తీసుకోవడం లేదని  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే ఇది ప్రధాన రోడ్.  పాదచారులు నడిచేందుకు వీలుగా నిర్మించిన ఫుట్ పాత్ లను  పూర్తిగా మూసి వేసి, అక్రమంగా వ్యాపారం చేసుకుంటున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారి పని తీరుపై స్ధానికులు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పాదచారులు నడిచేందుకు దారిలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక్కో సారి రోడ్డుపై నడక సాగించే పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం లక్షలకు లక్షలు వెచ్చించి ఫుట్ పాత్ నిర్మించినా, ఇవి ఆక్రమణకు గురి కావడంతో పాదచారులకు నిరుపయోగంగా మారాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఫుట్ పాత్ ఆక్రమణదారులపై తగిన చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలను తొలగించాలని  పాదచారులు, స్ధానికులు కోరుతున్నారు.