29 July, 2026 | 2:06 PM

వ్యాధుల కాలం.. వెద్యులు సగం!

29-05-2024 02:14 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 28 (విజయక్రాంతి): నిరుపేదలకు సర్కారు వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. అరకొర మందుల పంపిణీ, అవసరమైన సిబ్బంది లేక గ్రామీణ వైద్యం కునారిల్లిపోతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సేవలను పటిష్టం చేయడంలో సర్కారు నిర్లక్ష్యం ప్రజారోగ్య పరిరక్షణపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా వైద్యారోగ్య శాఖ పనితీరును ప్రశ్నార్థకంలో పడేస్తోంది. కుమ్రంభీం జిల్లా  వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి.

జిల్లాలో అన్ని పోస్టులు కలుపుకోని 527 మంది కావాల్సి ఉండగా 353 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 174 వివిధ పోస్టులు ఖాళీలున్నాయి. ఇక్కడ సగానికి పైగా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 46 మంది వైద్యాధికారులకు 14 మంది రెగ్యులర్,6 గురు కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్నారు. 26 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్ నర్సులు 77 మందికి 39  మంది విధులు నిర్వహించగా 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఫార్మసిస్ట్ 25 మందికి 22 మంది విధులు నిర్వహిస్తున్నారు. ల్యాబ్ టెక్నిషియన్లు 26 మందికి 19 మంది విధులు నిర్వహించగా 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య కార్యకర్త (మహిళ) పోస్టులు 114కు 76 మంది విధులు నిర్వహిస్తున్నారు.38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆరోగ్య కార్యకర్త (పురుషులు) 65 పోస్టులకు 34 మంది విధులు నిర్వహిస్తుండగా 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య పర్యవేక్షులు (మహిళ) పోస్టులు 22 మందికి 19 మంది విధులు నిర్వహిస్తున్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆరోగ్య పర్యవేక్షులు (పురుషులు) 22 మందికి 12 మంది విధులు నిర్వహిస్తున్నారు. 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య విస్తరణ అధికారి పోస్టులు 13 మందికి 8 మంది పని చేస్తుండగా 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక ఆరోగ్య అధికారి పోస్టులు 11కు  ముగ్గురు మాత్రమే ఉన్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండవ ఆరోగ్య కార్యకర్తలు 106 పోస్టులకు 101 మంది విధులు నిర్వహిస్తుండగా 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.జిల్లా వ్యాప్తంగా 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 108 ఉప ఆరోగ్య కేంద్రాలున్నాయి.  రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఆరోగ్య సేవాలను అందజేస్తున్నారు.

సీజనల్ వ్యాధులతో జాగ్రత్త

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కవ స్థాయిలో ఉంటుంది. వైద్యుల కోరతతో పాటు సిబ్బంది కోరత కూడా వైద్యారోగ్యశాఖను వెక్కిరిస్తుంది.వర్షాకాలంలో సాధరణంగా వచ్చే సమస్యల్లో జలుబు, జ్వరం సర్వసాధారణం, వైరల్ ఇన్ఫెక్షన్లకి ఇవి సాధారణ రూపం కాబట్టి వీటి కారణంగా ఎక్కువగా చాలా మంది జలుబు, జర్వంతో బాధపడుతుంటారు. ఆసలు సమ స్య వచ్చిన వెంటానే డాక్టర్‌ని సంప్రదించాలి. రుతుపవనాలు వచ్చాయంటే చాలు మలేరియా వచ్చిట్లే... వర్షం పడినప్పుడు నీరు ఎక్కవగా ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతుంది.

దీని వల్ల దోమలు పెరుగడంతో మలేరియా, డెంగ్యూ వంటి జర్వాలు వచ్చే అవకాశం ఉంటుంది. డెంగ్యూ జర్వం పెద్ద సమస్యే ప్రాణాంతకరంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఇంతే కాకుండా అతి సారం, టైఫాయిడ్, హెపటైటీస్ వ్యాధులు సోకుతాయి. వ్యాధులు సోకితే ఆరోగ్య నిపుణుల సలహా అవసరం అందుకు అనుగుణంగా జిల్లాలో వైద్యులు లేక పోవడంతో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు స్పందించి వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.