29 July, 2026 | 1:22 PM

ఇంట్లోకి కుక్క వచ్చిందంటూ 100కు ఫోన్

29-05-2024 02:16 AM

వరంగల్ తూర్పు, మే 28: భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 100ను పలువురు దుర్వినియోగం చేస్తున్నారు. సోమవారం ఉదయం కాశిబుగ్గ శివాలయం నుంచి ఓ వ్యక్తి 100 డయల్ చేసి తమ ఇంట్లోకి కుక్క వచ్చిందని ఫిర్యాదు చేశారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి పోలీస్‌స్టేషన్‌కి సమాచారం అందిన వెంటనే కానిస్టేబుల్ రాజయ్య ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని విచారించారు. తమ ఇంట్లోకి కుక్క వచ్చిందని తెలియజేయడంతో కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్‌కు గడియ పెట్టుకోకుండా ఇంట్లోకి కుక్క వచ్చిందని 100 డయల్ చేయడం ఏంటని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాలలో వైరల్‌గా మారింది. డయల్ 100ని తప్పుగా వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.