7 May, 2026 | 6:37 PM

నోటి దురుసుపై వేటు

22-05-2024 12:00 AM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అభ్యర్థి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. 24 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచారంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించింది. గంగోపాధ్యాయపై తీసుకున్న చర్య కాపీని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకూ పంపిన ఈసీ ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తం మహిళా లోకానికే అవమానకరమని, బెంగాల్ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఉన్నాయనీ పేర్కొంది.

అభ్యర్థులను కట్టడి చేయాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షులదేనని గుర్తు చేసింది. తమ్లక్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి బీజేపీ తరఫున గంగోపాధ్యాయ పోటీ చేస్తున్నారు. ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ‘సందేశ్ ఖలి అభ్యర్థి రేఖా పాత్రను బీజేపీ 2 వేల రూపాయలకు కొనుగోలు చేసిందని తృణమూల్ కాంగ్రెస్ అంటోందని, మరి మమతా బెనర్జీ ఎంతకు అమ్ముడు పోతున్నారు? మీ రేటు రూ.10 లక్షలా?’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సోషల్  మీడియాలో వైరల్ అవడంతో టీఎంసీ మండిపడింది. మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన గంగోపాధ్యాయపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది.

దీనిపై ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన ఈసీ తాజాగా ఆయనపై వేటు వేసింది. గంగోపాధ్యాయ మామూలు రాజకీయ వేత్త కాదు. ఎన్నికల బరిలో అడుగు పెట్టడానికి ముందు ఆయన కలకత్తా హైకోర్టులో జడ్జిగా పని చేశారు. అనేక కేసుల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్పులు కూడా చెప్పారు. దీంతో గంగోపాధ్యాయకు, టీఎంసీకి మధ్య చాలాకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికల వేళ ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని మరీ బీజేపీలో చేరారు. రోజుల వ్యవధిలోనే ఆయనకు ఆ పార్టీ టికెట్ కూడా లభించింది.

గంగోపాధ్యాయ బీజేపీ ఏజెంటనే విషయం ఆయన చర్యతో స్పష్టమయిందంటూ అప్పట్లో టీఎంసీ మండి పడింది కూడా. రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రత్యర్థులపైన విమర్శలు చేయడం సహజం. అయితే, న్యాయ వ్యవస్థలో సుదీర్ఘ కాలం పనిచేసి ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఎన్నో తీర్పులు ఇచ్చిన గంగోపాధ్యాయ లాంటి మేధావులు సైతం స్థాయి మరిచి రాజకీయ లబ్ధికోసం మహిళలపై అందునా ఓ సీఎం స్థాయి వ్యక్తిపైన ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఎంతమేరకు సబబు? 

విద్యావంతులు, మేధావులు రాజకీయాల్లోకి రావాలని, దీనివల్ల ఇప్పటి పరిస్థితిలో మార్పు వస్తుందని చాలామంది అంటుంటారు. కానీ, తాముకూడా రాగద్వేషాలకు అతీతులు కారని గంగోపాధ్యాయ లాంటి వారు గుర్తు చేస్తుంటారు.  గంగోపాధ్యాయ ఉదంతానికి ఒకరోజు అదే కలకత్తా హైకోర్టులో జడ్జిగా రిటైరయిన చిత్తరంజన్ దాస్ మరో సంచలనం సృష్టించారు. తన వీడ్కోలు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సభ్యుడినని వెల్లడించారు. ఈ విషయం కొందరికి రుచించదనీ వ్యాఖ్యానించారు.

అయితే, తాను బాల్యం నుంచి ఆరెస్సెస్‌లో ఉన్నానని, ధైర్యంగా, నిజాయితీగా ఉండడం,  అన్నిటికీ మించి దేశభక్తి వంటివాటిని అక్కడే నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. అవసరమయితే మళ్లీ అక్కడికి వెళ్లడానికి సిద్ధమేనని కూడా పేర్కొన్నారు. దాస్ ఈ విషయాలు చెప్పడం తప్పు కాకపోవచ్చు. కానీ, బహిరంగంగా, అందునా రిటైర్ అయ్యే సమయంలో చెప్పాల్సిన అవసరం ఉందా? అన్నదే ప్రశ్న. ప్రతి వ్యక్తికీ సొంత అభిప్రాయాలు ఉంటాయి. తాను చేసే పనిపై వాటి ప్రభావం పడకుండా చూసు కోవాలి. దాస్ అలాగే ఉన్నారనే అనుకుందాం. ఇప్పుడు ఆయన బైటికి చెప్పిన మాటలవల్ల మరో వివాదం తలెత్తుతుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే, ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లు పదవీ విరమణ తర్వాత వేరే బాధ్యతలకు దూరంగా ఉండటం మంచిదేమో.