7 May, 2026 | 5:48 PM

వాతావరణ మార్పులకు మూలం?

22-05-2024 12:00 AM

‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (వరల్డ్  మెటీరొలాజికల్ ఆర్గనైజేషన్, డబ్ల్యూయం ఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకా రం, ఈ ఏడాది చివరలో ‘ఎల్‌నినో’ అనే వాతావరణ ప్రతికూల మార్పు రావచ్చుననే విషయం ప్రపంచ మానవాళిని భయపెడుతున్నది. ఎల్‌నినో, లానినో సదరన్ ఆసి లేషన్ (ఈఎన్‌ఎస్‌ఓ) వలయాల ప్రభావం తో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు వాతావరణ మార్పులకు లోనవుతాయని తెలుస్తున్నది. గత మూడేళ్లుగా కొనసాగుతున్న ‘లానినో’ ప్రభావం క్రమంగా తగ్గుతూ వుండగా, రానున్న రోజుల్లో ‘ఎల్‌నినో’ చక్రం పునరావృతం కావచ్చని నిపుణులు అంటున్నారు. రానున్న ఏండ్లలో ‘ఎల్‌నినో’ ప్రభా వం పెరుగుతూ ప్రపంచవ్యాప్తంగా వేడిగాలులు, ప్రతికూల వాతావరణ మార్పులు, కరువు కాటకాలు, కొన్ని ప్రాంతాల్లో అకాల వర్ష బీభత్సాలు ఎదురు కావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

‘ఎల్‌నినో’ అనే స్పానిష్ పదానికి ‘లిటిల్ బాయ్’ అని, ‘లానినో’ పదానికి ‘లిటిల్ గర్ల్’ అని అర్థాలు ఉన్నాయి. సహజ సిద్ధంగా కేంద్ర తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితలం అధిక తాపాన్ని లేదా వేడిని పొందడాన్ని ‘ఎల్‌నినో’గా అర్థం చేసుకోవాలి. ‘ఎల్‌నినో’ ప్రభావంతో సముద్ర ఉపరితల జలాలు వేడెక్కి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో హరికేన్‌లు కూడా రావచ్చని తెలుస్తున్నది. ‘ఎల్‌నినో/లానినో సదరన్ ఆసిలేషన్’ వలయాల మూలంగా వేడి తగ్గుతూ చల్లదనం అనుభవంలోకి రావడాన్ని ‘లానినో’గా అర్థం చేసుకోవాలి. ‘లానినో’ ప్రభావంతో సముద్ర ఉపరితలం చల్లబడి అధిక వర్షాలతోపాటు భూతాపం కూడా తగ్గడం గమనించవచ్చు.

ఇండియాపై ప్రభావం

‘ఎల్‌నినో’ ఏర్పడితే నైరుతి రుతుపవనాలు బలహీనపడి భారతదేశంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. వ్యవసాయం దెబ్బతిని, కరువులు సంభవిస్తాయనీ శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. మార్చి మొదటి వారం నుంచి ఇండియాలోని 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అతిగా వేడెక్కడం గమనించారు. మూడేళ్ల తరువాత మార్చి 2023లో ‘లానినో’ ముగిసి రానున్న రోజుల్లో ‘ఎల్‌నినో’ ప్రభావం ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. ‘ఎల్‌నినో/లానినో సదరన్ ఆసిలేషన్ వలయాల ప్రభావంతో మే/జూన్ 2023లో తటస్థ స్థితి నుంచి ‘ఎల్‌నినో’ బలపడుతూ సెప్టెంబర్ నాటికి 80 శాతం పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

2023 జూలైలో ‘ఎల్‌నినో’ బలపడి ఏడాది వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్ఘారాలతో భూతాపం పెరగడం, వాతావరణ ప్రతికూల మార్పులు చోటు చేసుకోవడంతో ప్రపంచ మానవాళి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం తప్పనిసరి అవుతున్నది. 2022 మధ్య ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగవచ్చని, దీనివల్ల జరిగే వాతావరణ ప్రతికూల మార్పులతో పరిస్థితులు మరింత విషమించవచ్చని అంచనా వేస్తున్నారు. 

‘ఎల్‌నినో’ ఏర్పడిన ప్రతిసారి వర్షపాతం తగ్గుతుందనే నియమం కూడా ఏమీ లేదు. 1951 నుంచి నేటి వరకు ఏర్పడిన 15 ‘ఎల్‌నినో’ సందర్భాల్లో 6 ‘ఎల్‌నినో’ల కాలంలో సాధారణ లేదా అంతకన్న ఎక్కువ వర్షపాతం నమోదు కావడం గమనించారు. 

డా॥ బుర్ర మధుసూదన్ రెడ్డి