21 May, 2026 | 3:14 AM

ప్రభుత్వ భూమిని పరిరక్షించిన అధికారులు

21-05-2026 02:02 AM

కాజీపేట, మే 20 (విజయక్రాంతి): కాజీపేట్ మండలం శాయంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నెం. 23లో ఉన్న విలువైన ప్రభుత్వ బంచరాయి భూమిని అధికారులు సమన్వయంతో పరిరక్షించినట్లు కాజిపేట తహశీల్దార్ రాజు తెలిపారు. సదరు భూమిలో గతంలో అక్రమ మైనింగ్ నిర్వహించబడటంతో భారీ గుంతలు ఏర్పడి భూమి నిరుపయోగ స్థితికి చేరుకుందన్నారు. అనంతరం భద్రకాళి చెరువు పూడిక మట్టిని వినియోగించి ఆ గుంతలను పూడ్చి, ప్రజాప్రయోజనార్థం ఉపయోగపడే విధంగా భూమిని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు సంబంధిత అధికారుల నుండి ఎటువంటి ముందస్తు అనుమతులు పొందకుండా దేవాలయం పేరుతో ఆ విలువైన ప్రభుత్వ భూమిని చట్టవిరుద్ధంగా ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు తెలుసుకొని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ శాఖ, జి.డబ్ల్యూ.ఎం.సి, డీఆర్‌ఎఫ్ బృందం, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా రక్షించినట్లు చెప్పారు.

అదేవిధంగా, సంబంధిత వ్యక్తులు ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జాకు యత్నించడమే కాకుండా, అక్కడ వివాదాస్పద పరిస్థితులు సృష్టించి ప్రజలకు అసౌకర్యం కలిగించిన నేపథ్యంలో, వారి పై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇకముందు ఎవరైనా ప్రభుత్వ భూములపై ఆక్రమణలు, అన్యాక్రాంత చర్యలు లేదా చట్టవిరుద్ధ నిర్మాణాలకు పాల్పడినచో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తహశీల్దార్ హెచ్చరించారు.