మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
పరారీలో మరొకరు, ఆస్థి కోసమే అక్కను హతమార్చిన తమ్ముడు
కేసు వివరాలు వెల్లడించిన సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్
సూర్యాపేట, మే 20 (విజయక్రాంతి): మహిళా హత్య కేసుకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఘటన బుధవారం జరిగింది. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా కేంద్రంలో సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్నకుమార్ వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహడ్ గ్రామానికి చెందిన సరబి సైదులు అతని అక్క అంజమ్మ ఇరువురి మధ్య భూ తగాదా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంలో అక్కను తప్పిస్తే ఆస్తి తన సొంతం అవుతుంది అని భావించిన సైదులు సోమవారం ఉదయం గ్రామంలో ఉపాధి పనికి వెళుతున్న అక్కపై విచక్షణా రహితంగా కత్తితో దాడిచేసి హత్య చేసినట్లు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సురబి సైదులు, అతని భార్య ధనలక్ష్మి, కుమారుడు శివతేజ, బావమర్ధి కొండ భీమయ్య లు నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అయితే నిందితులను బుధవారం బృందావనపురం గ్రామంలో ఏ4 నిందితుడు కొండ భీమయ్య ఇంట్లో ముగ్గురు నిందితులు సైదులు, ధనలక్ష్మి, శివతేజ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
నాలుగవ నిందితుడు కొండ భీమయ్య పరారీలో ఉన్నాడన్నారు. అతన్ని సైతం త్వరలో పట్టుకుంటామన్నారు. వ్యవసాయ భూమి ఈ హత్యకు ప్రధాన కారణమని తేలినట్లు వివరించారు. కేసులో బాగా పనిచేసిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. భూమి, ఆస్తి సంబంధిత తగాదాలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలా దాడులకు పాల్పడడం సరికాదన్నారు. ఈ సమావేశంలో సిఐ రాజశేఖర్, ఆత్మకూర్ (ఎస్) ఎస్త్స్ర ఐలయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






