7 April, 2026 | 2:22 AM

వేసవి తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి

07-04-2026 12:00 AM

సంగారెడ్డి, ఏప్రిల్ 6(విజయక్రాంతి): వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ భారిన పడకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో ఫిర్యాదుల స్వీకరణ అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ముందుగానే చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజూ హీట్ వేవ్ ఉష్ణోగ్రతల నివేదికను జిల్లా అధికారుల గ్రూపులో షేర్ చేయాలని సీపీఓను ఆదేశించారు. కార్మికులు, సాధారణ ప్రజలు ఎండల వల్ల ఇబ్బందులు పడకుండా లేబర్ అడ్డాలు, పని ప్రదేశాల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

జిల్లాలోని అన్ని బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలు, సీహెచ్సీలలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సమృద్ధిగా నిల్వ ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, గురుకులాలు, వసతి గృహాలలో కూడా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.  పని ప్రదేశాలు, బస్టాండ్లు, పరిశ్రమల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తమ పరిధిలో అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా వడదెబ్బ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.