31 May, 2026 | 12:41 AM

ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి

31-05-2026 12:00 AM
  1. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 
  2. బీఎల్‌ఏ, ఎస్‌ఎస్‌ఏలతో సమీక్ష సమావేశాలు 

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి) : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందిరా భవన్‌న్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లు (ఎస్‌ఎస్‌ఏ)లతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించగా, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎస్‌ఎస్‌ఏ కోఆర్డినేటర్లు, రాష్ట్ర స్థాయి ఎస్‌ఎస్‌ఏ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా సెక్యులర్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యన్నారు. 

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఓటర్ల తొలగింపు ప్రక్రియ కూడా ఒక కారణమని మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. బీజేపీ తదు పరి లక్ష్యంగా పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలను ఎంచుకుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక నిఘా ఉంచుతుందని తెలిపారు.

ప్రతి వారం మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఓటర్ల జాబితా పరిశీలన వంటి అంశాలపై దృష్టి సారిస్తారని ఆయన వెల్లడించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయి నుంచి పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.