ఆపరేషన్ జన్వాడ
- 20 మీటర్ల ఫిరంగి నాలా 9 మీటర్లు కూడా
- లేదని సర్వే అధికారులు నిర్ధారణ
- రెండవ రోజు ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సర్వే
- ఫాంహౌస్ ముందు నుంచే నాలా వెళ్తున్నట్లు నిర్ధారణ
- ఆక్రమణకు గురైన విస్తీర్ణాన్ని గుర్తించిన అధికారులు
చేవెళ్ల, ఆగస్టు 28: జన్వాడ పాంహౌస్ వద్ద రెండవ రోజు అధికారులు భూసర్వే చేశారు. ఫిరంగి నాలా పరిధిలోనే జన్వాడ పాం హౌస్ ఉన్నట్లు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డుల ప్రకారం గ్రామ నక్షతో పాటు ఉస్మాన్‌సాగర్ హద్దులు, ఫిరంగి నాలా విస్తరించి ఉన్న ప్రాంతాలకు సంబంధించిన మ్యాపులను ప్రామాణికంగా తీసుకొని అధికారులు అధునాతన డీజీపీఎస్ సర్వే మిషన్ల ద్వారా భూ సర్వే చేశారు. కేటీఆర్ స్నేహితుడు ప్రదీప్‌రెడ్డిదిగా ప్రచారంలో ఉన్న జన్వాడ ఫాంహౌస్‌కు సంబంధించిన సమగ్ర భూ సర్వే నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని శంకర్‌పల్లి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
మంగళవారం జన్వాడ ఫాంహౌస్‌ను సర్వేచేసిన నంబర్లవారీగా వివరాలు సేకరించిన అధికారులు బుధవారం ఫిరంగి నాలా మొత్తాన్ని సర్వే చేపట్టారు. చేవెళ్ల ఆర్డీవో కార్యాలయం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ రత్నాకర్ ఆధ్వర్యంలో శంకర్‌పల్లి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తేజ, సర్వేయర్ సాయి, ఇరిగేషన్ వర్క్స్ ఇన్‌స్పెక్టర్ లింగం పోలీసు పహారా మధ్య నక్ష, డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్) మిషన్లతో కొలతలు తీసుకున్నారు.
నాలా ప్రారంభమయ్యే శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్ నుంచి జన్వాడలోని ఫాంహౌస్ వరకు కొలిచారు. అక్కడివరకు నాలా ఎంత వెడల్పు ఉండాలి? ప్రస్తుతం ఎంత ఉంది? కబ్జాకు గురైన చోట హద్దులను ఎలా చెరిపివేశారు? ఎంతమేర ఆక్రమించారో? అనే వివరాలు నమోదు చేసుకున్నారు. గతంలో నాలా 66 ఫీట్లు ఉండేదని ప్రస్తుతం 9 ఫీట్లు కూడా లేదని గ్రామస్తులు చెప్పిన స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు. నాలా కేటీఆర్ మిత్రుడు ప్రదీప్‌రెడ్డి ఫాంహౌస్ ముందు నుంచి వెళ్తున్నట్లు నిర్ధారణకు వచ్చి పూర్తి వివరాలతో నివేదిక రూపొందిస్తున్నారు.
ఫాంహౌస్ కోసం ఆక్రమించింది ఎంత?
ప్రదీప్‌రెడ్డి ఫాంహౌస్ నిర్మాణంలో నాలా ను ఆక్రమించి కాంపౌండ్ కట్టి.. గేట్ నిర్మించినట్లు ఇప్పటికే తేల్చిన అధికారులు.. అది ఎంత పరిధి ఉందో కొలతలు వేసి రికార్డు చేసుకున్నారు. ప్రదీప్ కేవలం గ్రామ సర్పంచ్ పర్మిషన్‌తో నిర్మాణం జరిపినట్లు గతంలో ఓనర్ హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సెక్రటరీ, స్థానిక రెవెన్యూ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఫాంహౌ స్‌కు ఆనుకొని కేటీఆర్ సతీమణి శైలిమ, ఆమె తల్లి శశిరేఖ భూములు ఉండడంతో వాటిపైనా అధికారులు ఆరా తీశారు. వీరి భూముల్లో ఫాంహౌస్‌కు వెళ్లేందుకు దారి, గేట్లు ఉండడంతో ఆ వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఫాంహౌస్ నిబంధనలు ఉల్లంగించినట్లు తేలితే కూలుస్తారని, అందుకు అవసరమైన వాహనాలు, బందోబస్తు, ఎంత సమయం పడుతుం దనే విషయాలపై స్థానిక , హైడ్రా అధికారులు చర్చించినట్లు ప్రచారం జరుగుతున్నది.
20 మీటర్ల నాలా 9 మీటర్లు కూడా లేదు
ఉస్మాన్‌సాగర్‌కు వరద ఉధృతిని తగ్గించి, సమీప గ్రామాల నుంచి వరద వచ్చే నీరు నేరుగా హుస్సేన్‌సాగర్‌లో కలిసేలా నిజాం నవాబులు నిర్మించిన ఫిరంగి నాలా ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్ గ్రామ రెవెన్యూ నుంచి మొదలయ్యే ఫిరంగి నాలా మోకిలా, గోపులారం, జన్వాడ మీదుగా గండిపేట జలాశయం పక్క నుంచి ఖానాపూర్, కోకాపేట, నార్సింగి, పుప్పాల్‌గూడ, మణికొండ, రాయదుర్గం, షేక్‌పేట, ఖైరతాబాద్ మీదుగా హుస్సేన్ సాగర్‌లో కలుస్తుంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తం 21 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ నాలా 18 మీటర్ల నుంచి 22.5 మీటర్ల వెడల్పు ఉండాలి. కానీ, సర్వే చేస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు కనీసం సగం వెడల్పు కూడా కనిపించడం లేదు. చాలా చోట్ల 9 నుంచి 12 మీటర్లు మాత్రమే ఉంది.






