12 May, 2026 | 4:37 PM

ఓయోలో దొంగ కెమెరా!

29-08-2024 06:26 AM
  1. రహస్య కెమెరాలతో ఏకాంత వీడియోల చిత్రీకరణ 
  2. బ్లాక్ మెయిల్, డబ్బుల వసూలు దందా 
  3. ఆర్‌జీఐఏ పోలీసులకు బాధిత జంట ఫిర్యాదు 
  4. పోలీసుల అదుపులో నిందితుడు 

రాజేంద్రనగర్, ఆగస్టు 28: ఓయో హోటల్ గదిలో రహస్య కెమెరా అమర్చి.. జంటలు ఏకాంతంగా ఉన్న వీడియోలు చిత్రీకరించి.. బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఉదంతం వెలుగు చూసింది. ఓ జంట ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడి ఆటకట్టించారు.  శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు ప్రాంతానికి చెందిన గణేశ్ మూడేళ్లుగా శంషాబాద్ పట్టణంలో బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఓ భవనాన్ని లీజుకు తీసుకున్నాడు.

ఓయో సంస్థతో ఒప్పందం చేసుకొని అందులో సీతాగ్రాండ్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నాడు. పథకం ప్రకారం అతడు హోటల్ గదుల్లోని స్విచ్ బోర్డులో రహస్య కెమెరాలు అమర్చాడు. హోటల్‌కు వచ్చి ఏకాంతంగా గడిపిన యువతీ యువకుల వీడియోలను రహస్యంగా చిత్రీకరించసాగాడు. రికార్డు చేసిన వీడియోలను వారికే తిరిగి వాట్సాప్ ద్వారా పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజసాగాడు. 

పోలీసులకు ఫిర్యాదుతో వెలుగులోకి 

గణేశ్ నిర్వహిస్తున్న ఓయో హోటల్‌తోపాటు బ్లాక్ మెయిలింగ్ దందా కొంతకా లంగా మూడు జంటలు..ఆరు బ్లాక్ మెయిలింగ్‌లు అన్నమాదిరిగా సాగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ జంటకు ఇదే క్రమంలో తాను రహస్యంగా చిత్రీకరించిన వీడియోను పంపించి డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు. బాధిత జంట ధైర్యంచేసి శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడు గణేశ్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హోటల్‌పై దాడులు నిర్వహించి ఓ కెమెరాతోపాటు రెండు సెల్‌ఫోన్ల ను స్వాధీనం చేసుకొని హోటల్‌కు నోటీసులు అందజేశారు. నిందితుడిని విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. 

వ్యభిచార గృహాలు! 

శంషాబాద్ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం, అదేవిధంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇదే అదనుగా ఇక్కడ వందలసంఖ్యలో పుట్టగొడుగులుగా ఓయో హోటళ్లు, లాడ్జీలు నిబంధనలకు విరుద్ధంగా వెలిశాయి. చాలాకాలంగా ఓయో హోటళ్లు, లాడ్జీల్లో దర్జాగా వ్యభిచారం జరుగుతున్నా పోలీసులు కళ్లెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన పోలీసు యంత్రాంగం అది తమ పని కాదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాము చాలారోజులుగా పోలీసులతోపాటు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు విపిస్తున్నాయి. పోలీసులతోపాటు ఇతర శాఖల అధికారులకు నెలవారీగా మామూళ్లు సమర్పించడంతో వ్యవహారం అంతా గుట్టుగా జరుగుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఓయో హోటళ్లు, లాడ్జీలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.