12 May, 2026 | 2:45 PM

చిన్నదామెర చెరువుపై మర్రి

29-08-2024 06:36 AM

ఎఫ్‌టీఎల్‌లో 5.01 ఎకరాలు.. బఫర్‌జోన్‌లో 3.23 ఎకరాలు కబ్జా!

  1. ఆక్రమిత చెరువు స్థలంలో భారీ భవనాలు, పక్కా షెడ్స్, పార్కింగ్ ఏరియా, కాలేజీ రోడ్ల నిర్మాణం 
  2. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సర్వేలో తేలిన నిజం 
  3. ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలకు దుండిగల్ తహసీల్దార్ నోటీసులు  

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 28 (విజయక్రాంతి): విద్యాసంస్థల అధినేతగా మర్రి రాజశేఖర్ రెడ్డికి సమాజంలో మంచి గుర్తింపు ఉంది. విద్యాసంస్థలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా వేల కోట్లను పోగు చేసుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఇవి చాలదన్నట్లు అతను ల్యాండ్ గ్రాబర్ అవతారమెత్తారు. తనకు చెందిన మర్రిలక్ష్మారెడ్డి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మర్రి లక్ష్మారెడ్డి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీల పక్కనే ఔటర్ రింగు రోడ్డును ఆనుకుని ఉన్న అతిపురాతన చిన్నదామెర చెరువును చెరబట్టాడు.

గత ప్రభుత్వ పెద్దలను మెప్పించి, అధికారులను బెదిరించి 123 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు ఎఫీటీఎల్, బఫర్‌జోన్‌లలో రూ.120 కోట్ల విలువైన 8.24 ఎకరాల స్థలం ఆక్రమించి కాలేజ్ భవంతులను, పార్కింగ్ షెడ్లను, రోడ్లను నిర్మించారు. అయితే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. గత పదేండ్లుగా మర్రి రాజశేఖర్ రెడ్డి చేసిన భూ అక్రమాలపై రేవంత్ ప్రభుత్వం దృష్టి సారించింది.

ఇందులో భాగంగా రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డుల ఆధారంగా చిన్నదామెర చెరువులో 8.24 ఎకరాల స్థలం ఆక్రమించినట్లు గుర్తించి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మర్రిలక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మర్రి లక్ష్మారెడ్డి ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్‌ల యాజమాన్యానికి బుధవారం నోటీసులు జారీ చేశారు. 

15.23 ఎకరాల ఎఫ్‌టీఎల్, 8.24 ఎకరాలు బఫర్ జోన్‌లో కబ్జా..

మేడ్చల్ జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండల, గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 405లో 123 ఎకరాల విస్తీర్ణంలో చిన్న దామెర చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువు చుట్టూరా ఉన్న 484 సర్వే నంబర్‌లో 3.21 ఎకరాలు, 485లో 2.17 ఎకరాలు, 486లో 0.36 ఎకరాలు, 488లో 2 ఎకరాలు, 489లో 3.15 ఎకరాలు, 492లో 1.24 ఎకరాలలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో 15.23 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 484, 485, 488, 489, 492 సర్వే నంబర్లలో సుమారు 8.24 ఎకరాల స్థలాన్ని మర్రి రాజశేఖర్ రెడ్డి ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు.

ఇందులో 489 సర్వే నంబర్‌లోని ఎకరంలో విద్యా సంస్థలకు సంబంధించిన భారీ భవనాలు, 485, 488, 484లోని 2 ఎకరాల స్థలంలో శాశ్వత షెడ్లను నిర్మించారు. అలాగే 492తో పాటు 489 సర్వే నంబర్లలోని 5.24 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ నిర్మాణాలతో పాటు ఎంఎల్‌ఆర్ కాలేజ్ రోడ్లను నిర్మించారని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం 8.24 ఎకరాల ఆక్రమణలలో ఎఫ్‌టీఎల్ పరిధిలో 5.01 ఎకరాలను, బఫర్ జోన్ పరిధిలో 3.23 ఎకరాలను ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. 

చెరువు మ్యాపులు మార్చే కుట్ర

హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులను సంరక్షించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం చెరువులను జియోట్యాగింగ్ చేయడంతో పాటు చెరువు నక్షాలను రూపొందించి హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. అయితే ఈ చెరువు మ్యాపులను మార్చేందుకు కూడా మర్రి లక్ష్మారెడ్డి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మర్రి లక్ష్మారెడ్డి ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు యత్నించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

అయితే చెరువు సర్వే నెంబర్లకు, చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ సర్వే నంబర్లకు మ్యాచ్ కాకపోవడంతో హెచ్‌ఎండీఏ అధికారులు చెరువు మ్యాపు మార్పు సాహసం చేయలేదనే విషయాన్ని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డుల మ్యాపుల ప్రకారం ఈ ఆక్రమణలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తామని ఓ అధికారి విజయక్రాంతి ప్రతినిధికి తెలిపారు.  

నోటీసులు జారీ...

చిన్నదామెర చెరువుకు సంబంధించిఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల పరిధిలో 8.24 ఎకరాల స్థలం ఆక్రమించి మర్రిలక్ష్మారెడ్డి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మర్రి లక్ష్మారెడ్డి ఎరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని ఈ రెండు విద్యాసంస్థల అధినేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి బుధవారం దుండిగల్ గండిమైసమ్మ మండల తహసీల్దార్ నోటీసులు జారీచేశారు.  ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులలో తహసీల్దార్ పేర్కొన్నారు.