30 March, 2026 | 8:00 PM

రాజేంద్రనగర్‌లో నల్లమందు కలకలం

03-05-2024 02:01 AM

రాజేంద్రనగర్, మే 2 (విజయక్రాంతి) : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో భారీగా నల్లమందు పట్టుబడింది. ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన సంయుక్త దాడిలో రూ. 1.73కోట్ల విలువ చేసే నల్లమందు పట్టుబడినట్లు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బాబుల్‌రెడ్డినగర్‌లోని గుట్కాలు తయారు చేసే ఓ కంపెనీలో అక్రమంగా నల్లమందు కలిగి ఉన్నట్లు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు విశ్వసనీయ సమాచారం అందగా టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి బుధవారం దాడులు నిర్వహించారు. అజర్ అనే వ్యక్తి గోదాం నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్ నుంచి నగరానికి తీసుకొచ్చి సప్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో నల్లమందును వివిధ బ్రాండ్స్‌కు సంబంధించిన గుట్కా కవర్స్‌లో ప్యాకింగ్ చేసి రాష్ట్రమంతా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో ప్యాకెట్‌ను మూడువేల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటునట్టు విచారణలో తేలింది. ఈ దాడుల్లో ఓ నిందితున్ని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు వివరించారు. ఈ దాడుల్లో ఓ బొలెరో వాహనం, 10మొబైల్ ఫోన్లు, 27కేజీల ఓపీఎం పాపి పౌడర్, 11కేజీల ఓపీఎం స్ట్రా హస్క్, వెయ్యి కేజీల టొబాకో ఓపీఎం మిక్చర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమావేశంలో శంషాబా ద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హరిప్రియ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ దేవేందర్‌రావు, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.