వార్డు సభ్యులకు వేతనాలు ఇవ్వాలి
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్డు సభ్యుల ముఖ్య నాయకుల సమావేశం సోమవారం రోజున జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ వార్డు సభ్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు ప్రత్యేక ఇన్సూరెన్సులు కల్పించాలని గ్రామాల అభివృద్ధిలో నిరంతరం అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ లకు ఎంపీటీసీలకు జడ్పిటిసి లకు కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు వేతనాలు అందిస్తున్నారు కానీ వార్డు సభ్యులకు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వార్డు సభ్యుల ఆవేదనను అర్థం చేసుకొని వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ నిర్ణయాలు భవిష్యత్తులో చేయబోయే కార్యచరణను గురించి చర్చించినట్లు తెలిపారు.
భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు వేతనాలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ లు కల్పించాలని వార్డు సభ్యుల గౌరవాన్ని పెంచే విధంగా ప్రత్యేక హక్కులు కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు, రాష్ట్ర మంత్రులను ,ఎమ్మెల్యేలను, వివిధ పార్టీల నాయకులను, కలసి వినతి పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.




