7 July, 2026 | 6:01 PM

చనిపోయినా చిరంజీవే… ఆరుగురికి జీవం నింపిన ఏడేళ్ల యశ్వన్

07-07-2026 04:48 PM

- చిన్న వయస్సులోనే అరుగురికి పునర్జన్మ నిచ్చిన త్యాగమూర్తి

గంభీరావుపేట,(విజయక్రాంతి): జీవితం మొదలవుతున్న వయసులోనే ఒక చిన్నారి తన ప్రాణాలను కోల్పోయినా, తన అవయవాలతో మరికొందరికి జీవం ఇచ్చి “చిరంజీవి”గా నిలిచాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కదిలిస్తోంది. లింగన్నపేటకు చెందిన బొంబాయి పాపారావు, పద్మ దంపతుల కుమార్తె సౌమ్య, అల్లుడు రఘు ఉద్యోగరీత్యా తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లా రాధాపురం గ్రామంలో నివసిస్తున్నారు.

వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, చిన్న కుమారుడు యశ్వన్ (7) గత నెల 29న ఇంటి సమీపంలో సైకిల్‌పై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యశ్వన్ తలకు తీవ్ర గాయమై బ్రెయిన్ డెడ్‌గా మారాడు. ఆసుపత్రిలో వైద్యులు ఎంత ప్రయత్నించినా బాలుడిని కాపాడలేకపోయారు. అలాంటి విషాద సమయంలో కూడా తల్లిదండ్రులు తమ మనసును గట్టిగా చేసుకుని, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా అవయవ దానానికి అంగీకరించారు.

తాతయ్య సూచనతో తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా యశ్వన్ యొక్క రెండు కిడ్నీలు, కాలేయం, గుండె కవాటం, రెండు కళ్ళు దానం చేసి మొత్తం ఆరుగురికి పునర్జన్మను అందించారు. ఒక కుటుంబానికి తీరని లోటు కలిగించిన ఈ ఘటన, మరో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. కన్నీటి మధ్య తీసుకున్న ఈ మహత్తర నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.మంగళవారం లింగన్నపేటలో యశ్వన్ అంత్యక్రియలు నిర్వహించగా, గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది. చిన్నారి మరణం అందరినీ కలచివేసినా, అతడు చేసిన అవయవ దానం మానవత్వానికి చిరస్మరణీయంగా నిలిచింది.