7 July, 2026 | 6:12 PM

గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!

07-07-2026 05:04 PM

దుర్వాసనతో రోగాల బారిన పడుతున్న కాలనీవాసులు

ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేత

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని గౌలిగూడ కాలనీకి వెళ్లాలంటే... ముక్కు మూయాల్సిందే అంటూ కాలనీవాసులు వాపోతున్నారు. గౌలిగూడ కాలనీకి వెళ్ళేందుకు పక్కన ఉన్న పీతిరి కుంటలో చర్మవ్యాధులతో అక్కడే జంతువులు మృతి చెందుతున్నాయి. దీంతో కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలకు దుర్వాసన వెదజల్లడంతో ఈగలు దోమలు వ్యాప్తి చెందడంతో కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా శివాజీ విగ్రహం నుండి గౌలిగూడ హనుమాన్ కు వెళ్లే రహదారిలో పేరుకుపోయిన జంతువుల కళేబరాలను చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించి కాలనీవాసులు రోగాల బారిన పడకుండా శుభ్రపరచాలని మున్సిపల్ కమిషనర్ అధికారులకు కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా మున్సిపల్ కమిషనర్, సబ్ కలెక్టర్ ఆర్డిఓకి విన్నవించిన పట్టించుకోవడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. తాజాగా మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో కాలనీవాసులు వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకోని  కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.