14 April, 2026 | 2:48 AM

ఓయూ వేగుచుక్క జార్జిరెడ్డి

14-04-2026 12:00 AM

కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు

పేర్లకి, పుకార్లకి, ఫకీర్లకి నిబద్ధులు 

నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు 

కొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు

 పావన నవజీవన బృందావన నిర్మాతలు 

 శ్రీశ్రీ అనేక మరణాలు ప్రాధాన్యత లేకుండా కాలగర్భంలో కలిసిపోతాయి. కొన్ని మరణాలు మాత్రమే చరిత్ర సృష్టిస్తాయి. ఆ కోవలోకి ఉస్మానియా యూనివర్సిటీ వేగుచుక్క కామ్రేడ్ జార్జిరెడ్డి అమరత్వం ముందు వరసలో ఉంటది. 70వ దశకంలో ఉస్మానియా క్యాంపస్‌లో చదువుకోవడానికి వెళ్లిన జార్జి రెడ్డికి అక్కడి పరిస్థితులే ఉద్యమకారుడిగా రూపాంతరం చెందేందుకు తోడ్పాటునిచ్చాయి.

పీడిత, తాడిత విద్యార్థులపైన మతోన్మాద భావాలతో జరుగుతున్న అరాచకాలను జార్జి రెడ్డి చూస్తూ ఉండలేకపోయారు. చదువులో తన మేటితనం, మేధాశక్తితో క్యాంపస్‌లోని విద్యార్థులకు మరింత దగ్గరయ్యారు. క్యాంపస్‌లోని విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ముందుండేవారు. వీటన్నింటిని మించి యూనివర్సిటీ విద్యార్థులకు తన ఉద్యమ ఆలోచనలతో జార్జి రెడ్డి ప్రభావితం చేశారు.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ర్యాగింగ్ చేస్తున్నవారి దారికి అడ్డుగా నిలబడి క్యాంపస్‌లో విర్రవీగుతున్న వారి పట్ల సింహస్వప్నమయ్యారు జార్జి రెడ్డి. నిరంతర రాజకీయ చర్చలతో విద్యార్థుల్లో మమేకమై నాయకత్వాన్ని నడిపిస్తున్న జార్జిరెడ్డి బృందం మతోన్మాదానికి వ్యతిరేకంగా, క్యాంపస్ విద్యార్థుల హక్కుల కోసం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థులు (పీడీఎస్) అనే సంఘాన్ని ఏర్పాటు చేసింది.

అత్యంత మేలకువతో, అణచబడ్డ విద్యార్థులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. క్యాంపస్‌లో ప్రగతిశీల భావాలను, వారి అభివృద్ధిని మతోన్మాదులు జీర్ణించుకోలేకపోయారు. దాంతో జార్జి రెడ్డి బృందంపై పలుమార్లు దాడులకు తెగబడ్డారు. కానీ, జార్జి రెడ్డి వారిని ప్రతిఘటించి తరిమేశారు. దాంతో ప్రత్యర్థులు  జార్జి రెడ్డిపై ప్రత్యేకంగా తమ దృష్టిని కేంద్రీకరించి అనేకసార్లు దాడికి పాల్పడ్డారు. అయినా   సిద్ధాంతాలకు అనుగుణంగా మరింతగా ఉద్యమాలపై దృష్టిసారించారు. సోషలిజం, మార్క్సిజం గురించి అధ్యయనం చేస్తూ శాస్త్రీయ దృష్టిని అలవర్చుకున్నారు.

అంతేకాకుండా క్యూబా విప్లవకారుడు చెగువేరా ప్రభావం జార్జి రెడ్డిపై మెండుగా పడింది. పీడిత ప్రజలకు ఉపయోగపడని చదువొద్దని శాస్త్రీయ దృక్పథంతో సమాజానికి సేవ చేయడమే ఉన్నతమైనదిగా భావించారు. అయితే, 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న జార్జిరెడ్డిని మతోన్మాదులు హత్య చేశారు. వీరుని మరణం కన్నీరు తెప్పించదు.

ఉద్యమాలై ఎగిసి పడినట్లుగా ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం జార్జి రెడ్డి త్యాగాల దారిలో పీడీఎస్ (యూ)గా రూపాంతరం చెందింది. వేలాది మంది జార్జి రెడ్డి వారసులు ఉద్భవించారు. జార్జి రెడ్డి సృష్టించిన ఉద్యమాల అలలు ఈనాటికి సజీవంగా నిలిచి ఉన్నాయి. జార్జి రెడ్డి చూపిన బాటలో నడవడమే నేడు ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి.