14 April, 2026 | 2:46 AM

మళ్లీ యుద్ధమేనా!

14-04-2026 12:00 AM

ఇస్లామాబాద్ వేదికగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించిన ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. సుమారు 21 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు సాగినప్పటికీ, ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రెండు వారాల పాటు చేసుకున్న సీజ్‌ఫైర్ సందిగ్ధంలో పడింది. ఫలితంగా మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ చర్చలు విఫలం కావడానికి ‘మీరంటే మీరే’ కారణమని ఇరాన్, అమెరికా ఒకరినొకరు నిందించుకోవడం గమనార్హం.

బెస్ట్ డీల్ ఆఫర్ చేసినా ఇరాన్ తిరస్కరించిందని అగ్రరాజ్యం చెప్పగా, తాము శాంతికి పాటుపడి ఉన్నామని కానీ, తమ విశ్వాసాన్ని అమెరికా పొందలేకపోయిందని ఇరాన్ చర్చల అనంతరం ప్రకటించింది. కాగా, అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ తరఫున ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చర్చలకు నాయకత్వం వహించిన విషయం విదితమే. ఎవరి మాట ఎలా ఉన్నా ఈ చర్చలు విఫలమయ్యేందుకు ఐదు అంశాలు ప్రధాన కారణమని తెలుస్తున్నది. ఒకటి, తమ డిమాండ్ల విషయంలో ఇరుపక్షాలు రాజీపడకపోవడం, ఎవరూ వెనక్కి తగ్గకపోవడం.

హోర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ, అణు కార్యక్రమాలకు సమ్మతి, తమ దేశంపై ఉన్న ఆంక్షల ఎత్తివేత లాంటి వాటిపై ఇరాన్ పట్టుబట్టగా, వీటిలో హోర్ముజ్‌పై నియంత్రణ, అణు కార్యక్రమాలకు సమ్మతికి అమెరికా అంగీకరించలేదని సమాచారం. రెండు, చర్చలు విఫలమైతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామని చర్చలు జరుగుతున్న సమయంలోనే ట్రంప్ బెదిరింపులకు పాల్పడటం.

మూడు, హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం ఇరాన్ పట్టుబట్టగా, అందుకు అమెరికా అంగీకరించకపోవడం. నాలుగు, ఒకవైపు తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉండగానే, మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడం. ఐదు, ముఖ్యంగా ఇరాన్, అమెరికాలకు ఒకరిపై మరొకరికి పూర్తిస్థాయిలో నమ్మకం లేకపోవడం. అదే సమయంలో చర్చలకు వేదికైన పాకిస్థాన్‌ను తాము విశ్వసించబోమని ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది.

ఏదేమైనప్పటికీ, శాంతి చర్చలు విఫలమవడం ప్రపంచానికి చేదు వార్త అనే చెప్పాలి. మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదమున్న ఈ పోరు ఆగిపోవాలని యావత్ ప్రపంచం మొదటినుంచీ ఆశిస్తున్నది. కానీ, అందరి ఆశలను వమ్ముచేస్తూ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చలు విఫలమైన వెంటనే ఇటు అమెరికా, అటు ఇరాన్ నుంచి హెచ్చరికలు వెలువడటం భయాందోళనలు కలిగిస్తున్నాయి.

ఇప్పటికే హోర్ముజ్ నుంచి ఇరాన్ పోర్టులకు పయనించే నౌకలను అమెరికా దిగ్బంధించడం మొదలుపెట్టింది. అందుకోసం అమెరికా భారీగా బలగాలను మోహరించింది. తమ నౌకలను అడ్డుకుంటే గల్ఫ్ ఓడరేవులను తాము దిగ్బంధిస్తామని ఇరాన్ దీటుగా బదులిచ్చింది. దీంతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే 40 రోజుల యుద్ధం మూలంగా ప్రపంచ వాణిజ్యం స్తంభించిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా చమురు మంటలంటుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులకు సన్నద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడకుండా నిలువరించాల్సిన అవసరం ఉన్నది. అందుకు ఐరాస, ప్రపంచ దేశాలు నడుం బిగించి, శాశ్వత శాంతికి బాటలుపరచాలని ఆశిద్దాం.