14 April, 2026 | 2:49 AM

నయా బానిసత్వం గిగ్ వర్కర్ వ్యవస్థ

14-04-2026 12:00 AM

నగర జీవితం వేగంగా పరిగెత్తే యంత్రంలా మారిపోయింది. ఉద యం మొదలై రాత్రి ముగిసే వరకు మనం చూసేది పరుగులు, పోటీ, పనులు, సమ యం కోసం పోరాటం, డబ్బు వెంట పయ నం. ఒక క్లిక్‌తో భోజనం ఇంటికి చేరుతుంది. ఒక యాప్‌తో క్యాబ్ తలుపు దగ్గరకు వస్తుం ది. మనం కదలకపోయినా ప్రపంచం మన ముందుకు వస్తోంది. ఈ సౌకర్యం వెనుక ఒక  పెద్ద సైన్యం ఉంది.

ఆ సైన్య వ్యవస్థే గిగ్. ఇప్పుడు ఈ పదం ఉద్యోగ రంగంలో వేగం గా విస్తరించింది. గిగ్ అంటే తాత్కాలిక పని లేదా స్థిరత్వం లేని, శాశ్వతం కాని పని అని అర్థంం. స్విగ్గి, జోమాటో డెలివరీ ఆర్డర్‌లు, ఉబర్ రైడ్, ర్యాపిడో, ఫ్రీలాన్సర్లు గిగ్ వ్యవస్థలే. అంటే అవి ఉద్యోగాలు కాదు, పని అవకాశ భాగాలు మాత్రమే. ఇది రోజు పని, రోజు సంపాదన. వీరు ఒక కంపెనీలో ఉద్యోగులు కాదు, పార్ట్‌నర్‌లు. వారికి ఫిక్స్‌డ్ జీతం ఉండదు, పని చేసినంతవరకే ఆదా యం ఉంటుంది. ఈ వ్యవస్థ యువతకు ‘మీకు మీరే బాస్’ అనే మధురమైన వాగ్దానం చేస్తుంది.

కొత్త రకం బానిసత్వం:

వారు మనకు సేవ అందించే సాధనాలు కాదు. జీవంతో ఉన్న మనుషులు. కానీ, మన దృష్టిలో వారు క్రమంగా యాప్‌లో ఒక ఐకాన్‌గా మారిపోతున్నారు. ఇదే గిగ్ ఎకానమీకి సంబంధించి మొదటి విషాదం. మనిషి కనిపించకుండా, సేవ మాత్రమే కనిపించడం. కంపెనీలు దీన్ని ఒక గొప్ప అవకాశంగా చూపిస్తాయి. మీకు మీరే బాస్  అని చెబుతాయి. ఇది యువతకు స్వేచ్ఛగా, ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ‘ఎవరూ ఆదేశాలు ఇవ్వరు, మీరు ఎప్పుడు పని చేయా లో మీరే నిర్ణయించుకోండి’ అనే భావన కలిగిస్తారు. ఉద్యోగ నియమాలు లేవు, ఫిక్స్‌డ్ టైమ్ లేదు, ఎవరూ నిబంధనలు పెట్టరు.

కానీ, ఈ స్వేచ్ఛ వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. వీరు పని చేయకపోతే ఆదాయం లేదు. అనారోగ్యం వస్తే సహాయం ఉండదు. ఒక రోజు పని ఆగితే, ఆ రోజు జీవితం, తిం డి కూడా ఆగిపోతుంది. ఇది ఉద్యోగం కాదు, పని చేసినంత వరకే బతుకు అనే పరిస్థితి. ప్రమాదం జరిగినా భరోసా ఉండదు. వృద్ధాప్యంలో భద్రత లేదు. అంటే ఇది స్వేచ్ఛ కాదు, భద్రత లేకుండా బతకాల్సిన పరిస్థితి.

ఈ వ్యవస్థలో స్వేచ్ఛ అనే పదం వెనుక దాగిన బానిసత్వం ప్రధాన సమస్య అని చెప్పవచ్చు. గిగ్ వర్కర్లకు నెలాఖరులో జీతం లేదు, సెలవులు లేవు, స్థిరత్వం లేదు. ప్రతి రోజు ఒక కొత్త పోరాటం. ప్రతి డెలివరీ కొత్త ఆదాయం, ప్రతి రైడ్ ఆశ. కానీ, ఈ ఆశ ఎప్పుడూ భయంతో కూడి ఉంటుంది. రేపు పని ఉంటుందా? అనే అనుమానం ఉం టుంది. నిరంతర ఒత్తిడితో వారి జీవితాలు రేస్‌లా మారిపోతుంది.

డిజిటల్ ఆధారిత నియంత్రణ:

మీరు మా ఉద్యోగి కాదని కంపెనీలు చెబుతాయి. కానీ వాస్తవం ఏమిటంటే, యాపే వారి యజమాని. యాప్ పని సమయాన్ని నిర్ణయిస్తుంది. ఎప్పుడు పని చేయా లో, ఎంత పని చేయాలో, ఎవరికీ పని ఇవ్వా లో ఒక ఆల్గారిథమ్ నియంత్రిస్తుంది. రేటిం గ్ వారి ఆదాయాన్ని నిర్ణయిస్తుంది. ఒక చిన్న తప్పు, ఒక నెగెటివ్ రివ్యూ కారణంగా అకౌంట్ బ్లాక్ అయితే వారు పని కోల్పోయినట్టే. ఈ పరిస్థితిని డిజిటల్ బానిసత్వం అని పిలవడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ యజమాని కనిపించడు, కానీ నియంత్రణ చాలా కఠినంగా ఉంటుంది.

ఆర్థిక దృక్కోణంలో గిగ్ ఎకానమీ ఒక విప్లవం. ఇది ఉపాధి అవకాశాలు సృష్టించింది. నిరుద్యోగ యువతకు ఒక మార్గం ఇచ్చింది. భారత జీడీపీలో గిగ్ ఎకానమీ వాటా సుమారు 1 1.5% వరకు ఉంటుందని అంచనా. కానీ, పరోక్ష లాజిస్టిక్స్ ఈ ట్రాన్స్‌పోర్ట్, ఫుడ్ డెలివరీ, హోం సర్వీసెస్ వంటి అనేక రంగాలకు మద్దతిస్తోంది కాబట్టి, సర్వీసులన్ని కలిపితే ఇది 2% వరకు ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. నీతి ఆయోగ్,  బీసీజీ వంటి సంస్థల అంచనాల ప్రకారం ప్రస్తుతం ఎనబై లక్షల మంది పనిచేస్తుండగా, ఇంకో నాలుగేళ్లలో రెండు కోట్ల మంది ఇందులో చేరే అవకాశముంది.

తద్వారా జీడీపీలో వాటా 4 వరకు పెరిగే అవకాశముంది. ప్రతి నాలుగు ఉద్యోగాల్లో ఒకటి గిగ్ లేదా ఫ్రీలాన్స్ రూపంలో ఉండి ఎక్కువ సంఖ్యలో యువతకు ఉపాధినిస్తూ వేగంగా పెరుగుతూ పట్టణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, వృద్ధి వేగంగా పెరుగుతూ యాప్ కంపెనీలు కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ, ఆ లాభాలకు బలమైన పునాది వేసే కార్మికుడు మాత్రం రోజువారీ ఆదాయం కోసం పోరాడుతున్నాడు. వారికి పీఎఫ్ ఉండదు, ఇన్సూరెన్స్, పెన్షన్ అనే మాటే లేదు. ఇది నయా శ్రమ దోపిడే.

గిగ్ వర్కర్లను గుర్తించని సమాజం:

అంతేకాదు, ఈ గిగ్ ఎకానమీని నియంత్రించే చట్టాలూ పూర్తి స్థాయిలో లేవు. భారతదేశంలో సోషల్ సెక్యూరిటీ కోడ్, 2020 వంటి చట్టాలు వచ్చినా అవి పూర్తి రక్షణ ఇవ్వడం లేదు. గిగ్ వర్కర్లను గుర్తించినా వారి హక్కులను పూర్తిగా అమలు చేయలేదు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. యూకేలో ఉబర్ కేసులో డ్రైవర్లను వర్కర్లుగా అక్కడి కోర్టు గుర్తించింది. అమెరికాలో ఏబీ 5 చట్టం గిగ్ వర్కర్ల హక్కుల కోసం ప్రయత్నించింది.

యూరోపియన్ యూనియన్ కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. ఈ సమస్యను వ్యక్తిగత స్థాయిలో మాత్రమే పరిష్కరించలేము. ఇదొక వ్యవస్థాగత సమస్య. కాబట్టి పరిష్కారం కూడా వ్యవస్థాగతంగా ఉండాలి. ఇందులో ప్రభుత్వం, కంపెనీలు, సమాజం మూడు వర్గాలు తమ బాధ్యతను స్వీకరించాలి. గిగ్ ఎకానమీ వేగంగా పెరుగుతున్న ఈ సమయంలో, చట్టాలు కూడా అదే వేగంతో అభివృద్ధి చెందాలి.

గిగ్ వర్కర్లను అధికారికంగా కార్మికులుగా గుర్తించాలి. కనీస వేతన అమలు, పని గంటల పరిమితి, ఆరోగ్య, ప్రమాద బీమా, ప్రమాద భద్రత లాంటి ప్రాథమిక హక్కులను కల్పించాలి. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 ప్రారంభమైన చట్టాలను అమలు చేయాలి. అల్గారిథ మ్ పారదర్శకతను పెంచాలి. అకౌంట్ బ్లాక్ వంటి నిర్ణయాలపై న్యాయపరమైన సమీక్ష ఉండాలి. ప్రభుత్వంతో పాటు కంపెనీల బాధ్యత కూడా అంతే ముఖ్యం. గిగ్ వర్కర్లకు తగిన గౌరవం ఇవ్వాలి. కంపెనీలు తమ లాభాల్లో ఒక భాగాన్ని వర్కర్ల భద్రతకు కేటాయించాలి. ఇన్సూరెన్స్, ఆరోగ్య సేవలు, అత్యవసర సహాయం అందించాలి.

ట్రాఫిక్‌తో పోరాడుతూ, సమయంతో పోటీ పడుతూ పని చేసే డెలివరీ బాయ్‌లను ఈ సమాజం గుర్తించడం లేదు. మన దైనందిన జీవితంలో గిగ్ వర్కర్ల పాత్ర అపారమైనది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు, ప్రయాణం నుంచి గృహ సేవల వరకు మన అవసరాలను తీర్చడంలో వారే కీలకం. కానీ, వారిని ఏమాత్రం గౌరవించరు. ఈ నేపథ్యంలో సమాజం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వాళ్ల కష్టాన్ని ఈ సమాజం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

 వ్యాసకర్త సెల్: 8466827118