13 July, 2026 | 3:57 PM

వరి రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి

13-07-2026 03:02 PM

వ్యవసాయ అధికారి అనూరాధ రెడ్డి 

మొయినాబాద్ జూలై 13(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ప్రాధాన్యత వరి రకాలను సాగు చేసిన రైతులు క్వింటాలుకు రూ.500 బోనస్ పొందేందుకు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మొయినాబాద్ మండల వ్యవసాయ అధికారి పి. అనూరాధ రెడ్డి సూచించారు. ప్రభుత్వం సన్న వరి సాగును ప్రోత్సహించే లక్ష్యంతో RNR-15048 (తెలంగాణ సోనా), BPT-5204 (సాంబా మసూరి)(సోనా మసూరి అన్ని కూడా పిలుస్తారు), KNM-1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, WGL-44, KNM-7715 వంటి ప్రాధాన్యత వరి రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందజేస్తోందన్నారు.

బోనస్ పొందాలంటే రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్లను సంప్రదించి పంట వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని తెలిపారు. నమోదు చేసిన రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపించి, ధాన్యం కొనుగోలు సమయంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో బోనస్ నేరుగా జమ చేస్తారని చెప్పారు. నమోదు చేయించుకోని రైతులకు బోనస్ వర్తించదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పి. అనూరాధ మండలంలోని విత్తన దుకాణాలను సందర్శించి ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. రైతుల వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని విత్తన డీలర్లకు సూచించారు. మండలంలోని అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆమె కోరారు.