వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరగాలి
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తూ ధాన్యం వర్షాల వల్ల దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యపు సంచుల నిల్వ కోసం తగిన స్థలాలను ముందుగానే గుర్తించాలని, తూకం పూర్తయిన ధాన్యపు సంచులను వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ ప్రొజెనీ మ్యాపింగ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
మండలాల వారీగా మ్యాపింగ్ పురోగతిని పరిశీలించిన కలెక్టర్, ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. బీఎల్వోలు మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. సూపర్వైజర్లు, తహసీల్దార్లు మ్యాపింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, స్థానిక అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. అనంతరం జనగణన ప్రక్రియకు సంబంధించిన బ్యానర్‌ను ఆవిష్కరించారు.






