13 April, 2026 | 11:30 PM

ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారకులెవరు?

13-04-2026 09:53 PM

* ప్రిన్సిపలా?.. అధ్యాపకులా?..

* ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

* హాజరు శాతం మెరుగ్గా ఉన్నా దక్కని ఫలితాలు

పాపన్నపేట: పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. ఆదివారం ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో 55 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అదే గత ఏడాది 72 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఏడాది సరియైన ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. విద్యార్థుల హాజరు శాతం మెరుగ్గా ఉన్నా అనుకున్న రీతిలో ఉత్తీర్ణతను సాధించలేకపోయారు. ఉత్తీర్ణత తగ్గడానికి కారకులైన  ప్రిన్సిపల్, అధ్యాపకులుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

గత ఏడాది ఈ కళాశాలలో 5 మంది గెస్ట్ లెక్చరర్స్, మిగతా వారు కాంటాక్ట్ లెక్చరర్స్ ఉండేవారు. ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని పర్మినెంట్ చేస్తూ అదే కళాశాలలో అధ్యాపకులుగా నియమించింది. గెస్ట్ ఫ్యాకల్టీని తొలగించి నూతనంగా ప్రభుత్వ నియమించిన అధ్యాపకులను ఫుల్ ఫీల్ చేసింది. దీంతో కళాశాలలో అందరూ ప్రభుత్వ అధ్యాపకులే ఉన్నారు. కానీ ఇక్కడ కళాశాలలో ప్రిన్సిపల్ కు, అధ్యాపకులకు సరియైన సమన్వయం లేకపోవడంతో తరగతులు సరిగ్గా జరగలేవన్న ఆరోపణలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులు సరిగ్గా కాలేజీకి హాజరైనప్పటికి ఉత్తీర్ణులు కాలేకపోయారు.

ప్రభుత్వం కళాశాల విద్యా రంగానికి ఎన్నో డబ్బులు వెచ్చించి ప్రత్యేక పుస్తకాలు, ల్యాబ్ తో పాటు కళాశాల మెంటెనెన్స్ కోసం భారీ బడ్జెట్ కేటాయించినప్పటికీ ఫలితాలు రాబట్టడంలో విఫలమయ్యారు. డబ్బులు ఉన్నవారు కార్పొరేట్ కళాశాలకు వెళ్తున్నారు. పేద కుటుంబాల విద్యార్థులు వారితో పోటీపడి చదువుకుందామని ప్రభుత్వ కళాశాలకు వెళితే ఫలితాలు తలకిందులయ్యాయి. దీనితో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు డిమాండ్ చేస్తున్నారు.