మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ తో పాటు సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కనీస మద్దతు ధర క్వింటాల్ కి రూ. 2400/- ఉందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటలను అమ్మకానికి వేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులని అన్ని విధాల ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఒక వైపు చేతికొచ్చిన పంట నష్టం వాటిల్లితే, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి, ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. పంట నాణ్యతను పక్కనపెట్టి అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు,రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




