11 April, 2026 | 2:50 AM

నేడు శాంతి చర్చలు

11-04-2026 01:08 AM
  1. అమెరికా - ఇరాన్ మధ్య పాక్ మధ్యవర్తిత్వం 
  2. ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ 
  3. చర్చలకు ఇరాన్ బృందం రాకపై సందిగ్ధత 
  4. ఇజ్రాయెల్ కావాలా? శాంతి చర్చలు కావాలా? అని అమెరికాను ప్రశ్నిస్తున్న ఇరాన్

ఇస్లామాబాద్/ వాషింగ్టన్/ టెహ్రాన్, ఏప్రిల్ 10: పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో శనివారం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగనున్నాయి. చర్చలకు హాజరయ్యేందుకు అమెరికా తరఫున ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వా న్స్ ఇస్లామాబాద్ చేరుకున్నారు. కానీ, ఇరాన్ ఈ చర్చలకు హాజరవుతుందా లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొన్నది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ బేషరతుగా ఆపాలని, దాడులను అడ్డుకోవడంలో అమెరికా విఫలమైందని ఇరాన్ మండిపడింది.

‘మీకు ఇజ్రాయెల్ కావాలా? లేక శాంతి చర్చలు కావా లా?’ అంటూ సూటిగా ప్రశ్నించింది. ఒకవైపు శాంతి గురించి మాట్లాడుతూనే.. మరోవైపు ఇజ్రాయెల్ దాడులపై మౌనం వహించడం సరికాదని, ఇది అమెరికా అవలంబిస్తున్న ద్వంద్వ నీతి నిదర్శనమని నిప్పులు చెరిగింది. తాము శాంతి చర్చలకు రావాలంటే అమెరికా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికింది. ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం వల్ల శాంతి చర్చలకు విఘాతం కలుగుతున్నదని పేర్కొంది.

లెబనాన్ కూడా తాత్కాలిక కాల్పుల విరమణ పరిధిలోకి వస్తుందని, అక్కడ దాడులు ఆపితేనే తాము చర్చలకు వస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ తరఫున శాంతిచర్చలకు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ పాక్ హాజరవుతారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. అయితే.. దీనిపై అధికారంగా స్పష్టతేమీ లేదు.

హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ, నౌకల రవాణాకు టోల్ వసూలు సహా ౧౦ డిమాండ్లను నెరవేరిస్తేనే శాంతి చర్చలకు హాజరవుతామని తేల్చిచెప్పింది. మరోవైపు, శాంతి చర్చల కోసం పాకిస్థాన్ ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. రెండు రోజులపాటు దేశంలో హైఅలెర్ట్ అమలుకానున్నది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సర్కార్ సెలవులు ప్రకటించింది. రాజధానిలోని పార్ల మెంట్, ప్రభుత్వ కార్యాలయాలు, ఎంబసీలు, విదేశీ సంస్థల కార్యాలయాలున్న ప్రాంతమైన రెడ్‌జోన్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది.

ముఖ్యంగా ఇరాన్ ప్రతినిధి బృందానికి రక్షణగా తన యుద్ధ విమానాలను పాకిస్థాన్ పశ్చిమాసియా వైపు పంపించింది. ఇజ్రాయెల్ నుంచి ఎదురయ్యే ముప్పును దృష్టిలో ఉంచుకుని, ఈ ఆపరేషన్ చేపట్టింది. జేఎఫ్--17 థండర్, ఎఫ్ యుద్ధ విమానాలు ప్రస్తుతం ఇరా న్ పోర్ట్ సిటీ బందర్ అబ్బాస్ గగనతలంలో గస్తీ కాస్తున్నాయి.

అమెరికా--ఇరాన్ మధ్య శాంతిచర్చల నేపథ్యంలో అమెరికన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఒక రవాణా విమానం పాకిస్థాన్‌లోని నూర్‌ఖాన్ బేస్‌కు చేరుకున్న ది. ఇరాన్ విధించిన షరతులతో ఇస్లామాబాద్ చర్చలు జరుగుతాయా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

పాక్ రక్షణ మంత్రి పోస్ట్ చిచ్చు

లెబనాన్‌లో ఇజ్రాయెల్ మారణకాండ సృష్టిస్తోందంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ వివాదాస్పదమైం ది. శాంతిచర్చలను ఆహ్వానించి మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ మంత్రే ఇలాంటి పోస్ట్ పెట్టడమేంటనే ప్రశ్నలు ఇజ్రాయెల్ అధికార వర్గాల నుంచి తలెత్తాయి. తర్వాత, కొంతసేపటికే ఖావాజా ఆ పోస్టును సోషల్‌మీడియా నుంచి తొలగించారు. అయినప్ప టికే, జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

మాతో ఆటలు వద్దు: జేడీ వాన్స్

పాకిస్థాన్ చొరవ తీసుకుని శాంతిచర్చలకు ఆహ్వానించిందని, ఆ దేశ గౌరవార్థం తమ బృందం ఇస్లామాబాద్‌కు చేరుకున్నదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ బయల్దేరే ముందు ఆయన వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడారు. అమెరికాను తప్పుదోవ పట్టించాలని చూస్తే.. తమ బృందం గట్టిగా సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు.

తమ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకాలతోనే తాము ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్ చిత్తశుద్ధితో శాంతి చర్చలకు వస్తేనే తాము సహకరిస్తామని, తమతో ఆటలాడుకోవాలని చూస్తే మాత్రం సహించబోమని హెచ్చ రించారు. తన మొండి వైఖరి వీడి ఇరాన్ చర్చలకు రావాలని తాము కోరుకుంటున్నామని వెల్లడించారు. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇప్పటికీ తెరవకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. 

అమెరికాకు ఇరాన్ సూటి ప్రశ్నలు

శాంతిచర్చలపై ఇరాన్ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించింది. చర్చల కంటే ముందు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను అపాలని, దాడుల ను అమెరికా ఎందుకు మౌనంగా చూస్తున్నదని నిలదీసింది. ఒకవైపు చర్చల కోసం ఆహ్వానిస్తూనే.. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ప్రోత్సహిస్తున్నదని మండిపడింది. చర్చలు ప్రారంభించడానికి ముందే తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపింది. ఇజ్రాయెల్ ఉల్లం ఘనలకు అమెరికా బాధ్యత వహిస్తుందా లేదా అనేది స్పష్టంగా తెల పాలని డిమాండ్ చేసింది.