11 April, 2026 | 2:46 AM

కోడ్ ఉల్లంఘనే

11-04-2026 12:52 AM
  1. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే మహిళలకు 33 % రిజర్వేషన్ల బిల్లు అంటున్న బీజేపీ 
  2. సీడబ్ల్యూసీ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 
  3. విపక్షాలు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు

న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౦: ‘ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తెరమీ దకు తీసుకువచ్చింది. బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఓట్లు రాబ ట్టుకునేందుకు ఎత్తులు వేస్తున్నది. దీని లో భాగంగానే ఈనెల 15 నుంచి 18 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి, ఆ బిల్లులను హడావుడిగా ఆమోదింపజేసుకునేందుకు సిద్ధమవుతున్నది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రత్యేక సమావేశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రతిపాదన రాలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని ఇందిరాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు.

మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలోనే మహిళా రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చామని, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక ఆ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్ష పార్టీలన్నీ కోరాయని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్లలో సామాజిక న్యాయం జరగాలని, ఓబీసీ మహిళలకు కూడా కోటాలో వాటా ఉండాలని అభిప్రాయపడ్డారు. 

డీలిమిటేషన్ సున్నితమైన అంశం

నియోజకవర్గాల పునర్విభజన అనేది అత్యంత సున్నితమైన విషయమని, దీనిపై లోతైన సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. బిల్లు ద్వారా కేంద్రం లోక్‌సభ స్థానాలను 543 నుంచి 816కి పెంచాలని చూస్తున్నదని వెల్లడించారు. కొత్త జనగణన కోసం వేచి చూడకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పునర్విభజన చేస్తే ఉత్తర భారతం, దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యంలో అసమతుల్యత వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల నుంచే కొత్త మార్పులు అమలులోకి రావాలని కేంద్రం కోరుకుంటున్నదని, అందుకే రాజ్యాంగ సవరణ బిల్లు కోసం ఆరాటపడుతున్నదని విమర్శించారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ధ్వజమెత్తారు.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ సభ్యులు స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సి ఉందని నొక్కిచెప్పారు. మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. విపక్ష నాయకులతో చర్చించి త్వరలోనే ఒక ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

అనారోగ్య కారణాల వల్ల ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సమావేశానికి వర్చువల్‌గా హాజరయ్యారు. సమావేశంలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్ సుఖు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, సచిన్ పైలట్, సీనియర్ నేతలు మీరాకుమార్, అంబికాసోని, ఆనంద్ శర్మ, సల్మాన్ ఖుర్షీద్, నాసిర్ హుస్సేన్ పాల్గొన్నారు.