పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి
బూర్గంపాడు,(విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరును సమీక్షించారు.గ్రేవ్, ప్రాపర్టీ, దొంగతనం కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిందితులను గుర్తించి అరెస్టు చేయడంతోపాటు చోరీకి గురైన ఆస్తిని రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గత నేర చరిత్ర ఉన్న వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. సీసీటీఎన్‌ఎస్ 2.0లో కేసుల వివరాలను సక్రమంగా నమోదు చేయడంతోపాటు ఈ-సాక్ష్య, నాట్‌గ్రిడ్, గాండీవ వంటి సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై నిఘా పెంచాలని ఆదేశించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. డీఎస్పీ ఆర్.సతీష్‌కుమార్, సీఐ సతీష్, ఎస్సైలు మేడ ప్రసాద్, రామ్మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.






