4 August, 2026 | 3:37 AM

ఎంప్లాయ్ హెల్త్ స్కీం జాప్యంపై పెన్షనర్ల ఆందోళన

04-08-2026 02:08 AM

ఖమ్మం టౌన్, ఆగస్టు 3 (విజయ క్రాంతి): ఎంప్లాయ్ హెల్త్ స్కీం అమలులో ప్రభుత్వం జాప్యం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మంలోని పెన్షనర్స్ భవన్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబాకుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు వజ్జా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత మూడు నెలలుగా పెన్షనర్ల నుంచి చందాలు వసూలు చేసినప్పటికీ హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు.

జిల్లా అధ్యక్షుడు ఎం. సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరు వేణు మాట్లాడుతూ, రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ నివేదిక విడుదల చేయకపోవడం, ధరల సూచిక ప్రకారం ఇవ్వాల్సిన ఐదు డీఏలను మంజూరు చేయకపోవడం వల్ల ఉద్యోగ, పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. పూర్ణచంద్రరావు, ఆర్. దుర్గాదేవి, ఆర్థిక కార్యదర్శి రాయల వెంకటనారాయణ, జిల్లా నాయకులు ఉపేందర్ రావు, జానయ్య, బాబురావు, రవీంద్రరావు, బసవరావు, వెంకటేశ్వర్లు,  తదితరులతో పాటు 200 మందికి పైగా పెన్షనర్లు పాల్గొన్నారు.