తల్లిపాలే బిడ్డకు అమృతం ముర్రుపాల ప్రాముఖ్యతపై అవగాహన
ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
కల్లూరు, ఆగస్టు 3 (విజయక్రాంతి): తల్లిపాలే బిడ్డకు అమృతంతో సమానం అన్న భావాన్ని ప్రజలకు తెలియజేస్తూ చంద్రుపట్ల,రఘునాథగూడెం గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించారు.చండ్రుపట్ల సెక్టార్ సూపర్వైజర్ సుజాత,సర్పంచ్ సుధారాణి రాణా మాట్లాడుతూ, పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని తెలిపారు.ముర్రుపాలలో అధిక పోషక విలువలు ఉండి,బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని, తల్లి, బిడ్డల మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తాయని వివరించారు.
తల్లిపాలు శిశువును వివిధ వ్యాధుల నుండి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని,ఆరు నెలల వరకు తల్లిపాలే శ్రేయస్కరమని వారు పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలు,బాలింతలు,చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యత గురించి వివరించారు.
అదేవిధంగా చెన్నూరు గ్రామపంచాయతీ నందు సూపర్వైజర్ వెంకటమ్మ ఆధ్వర్యంలో కూడా తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో రఘునాథగూడెం సర్పంచ్ సుధారాణిరాణా, ఉపసర్పంచ్ కర్నాటి కోటేశ్వరి రామకృష్ణారెడ్డి, ఏఎన్‌ఎం పద్మ,అంగన్వాడి టీచర్లు రేవతి, ప్రియాంక, జ్యోతి,పద్మ,యశోద,లక్ష్మీ,మంగమని,కృష్ణవేణి, ప్రభావతి,మనమ్మ,ఉదయశ్రీ చిట్టెమ్మ, సీతారావమ్మ,ఆశ వర్కర్లు జానపాటి సావిత్రి,పద్మ,రమాదేవి కళ్యాణి,ఉష, సైదమ్మ, తల్లులు,చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






