15 April, 2026 | 4:49 AM

బెంబేలెత్తిస్తున్న కోతుల బెడద

15-02-2026 12:36 PM

తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు 

భయాందోళనలో కాలనీవాసులు

నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పైకాజి నగర్ తో పాటు పలు కాలనీలలో  కోతుల బెడద రోజురోజుకు పెరుగుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కాలనీల్లోకి గుంపులుగా ప్రవేశిస్తున్న కోతులు ఇళ్ల పైకప్పులు, బాల్కనీలు, వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ భయాందోళనలకు కారణమవుతున్నాయి.

ఇటీవల కోతుల దాడుల వల్ల కొందరు స్థానికులు గాయపడటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడటం, వస్తువులను పాడుచేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు.జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉండటంతో ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కోతుల బెడద నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.