14-10-2025 07:39:16 PM
జైసల్మేర్: రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం జైసల్మేర్ నుండి జోధ్‌పూర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలు సహా దాదాపు 20 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని జవహర్ ఆసుపత్రికి, తీవ్ర కాలిన గాయాలతో ఉన్న కొంతమంది ప్రయాణికులను జోధ్‌పూర్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేలోని థైయత్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఎప్పటిలాగే మధ్యాహ్నం 3 గంటలకు జైసల్మేర్ నుండి జోధ్‌పూర్‌కు బయలుదేరినట్లు సమాచారం. దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత, బస్సు వెనుక నుండి అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు మరియు డ్రైవర్ అర్థం చేసుకునేలోపే, బస్సు మంటల్లో చిక్కుకుంది. భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు కిటికీలు పగలగొట్టి బస్సు నుండి దూకారు. చాలా మంది ప్రయాణికుల దుస్తులు, వస్తువులు కాలిపోయాయి.
స్థానకుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అగ్నిమాపక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ఇంజిన్ లేదా వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.