అంటూ వ్యాధుల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్
కామారెడ్డి, ఆగస్టు 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాల తో అంటువ్యాధు లు ప్రబలే అవకాశం ఉందని నివారణకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నీటి కలుషితం, చెత్త పేరుకుపోవడం, నిల్వ నీరు ఏర్పడటం, దోమల వ్యాప్తి వంటి కారణాలతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాగునీటిని తప్పనిసరిగా మరిగించి లేదా శుద్ధి చేసిన తర్వాత మాత్రమే తాగాలన్నారు.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, చెత్తను నిర్ణీత ప్రదేశాల్లోనే వేయాలన్నారు. కాలువలు, డ్రైనేజీలు మూసుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కాపాడితే అంటువ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చు అని అన్నారు. ఆరోగ్యకరమైన కామారెడ్డి జిల్లాను నిర్మిద్దాం అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






